సీఎం కుప్పం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
చిత్తూరు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3 నుంచి 5 వరకు కుప్పం నియోజకవర్గంలో చేపట్టనున్న మూడు రోజుల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కుప్పం అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి వికాస్ మరమత్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, కుప్పం ఆర్డీవో విజయలక్ష్మితో పాటు వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రజాసభలు, రైతులతో సమావేశాలు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమీక్షలు, అవగాహన ఒప్పందాల మార్పిడి కార్యక్రమాలు ఉండనున్న నేపథ్యంలో ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రజాసభలకు పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, అల్పాహారం, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య సేవలు, అంబులెన్సులు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత, విద్యుత్ సరఫరా, వేదికలు, ధ్వని వ్యవస్థ తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలాఫలకాలను ఒకే నమూనాలో సిద్ధం చేయాలని, పారిశ్రామిక సంస్థలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాల వివరాలను ఖరారు చేయాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి సందర్శించనున్న నెట్ జీరో నమూనా గృహాలు, ఏఆర్‌సీ భవనం, ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్ కేంద్రం, అధికారుల అతిథి గృహం, ఎల్పీజీ శ్మశానవాటిక, బస్‌స్టాండ్, పారిశ్రామిక యూనిట్లు, ఎంఎస్‌ఎంఈ పార్కు తదితర ప్రాంతాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ప్రతి శాఖాధికారి తన శాఖ పరిధిలో ప్రత్యేక విధుల ఉత్తర్వులు జారీ చేసి బాధ్యతలను స్పష్టంగా అప్పగించాలని, చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ప్రోటోకాల్, కాన్వాయ్, రవాణా, వసతి, భోజన ఏర్పాట్లు, ప్రజల సమీకరణ వంటి అన్ని అంశాల్లో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ద్వారా కుప్పం నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయని, ఇది జిల్లాకు ప్రతిష్ఠాత్మకమైన పర్యటన కావడంతో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, అంకితభావంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు.
