ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి
- ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆముదాలవలస, ఆంధ్రప్రభ : ఆముదాలవలస పట్టణంలోని సీవాప్ కార్యాలయంలో విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు, మండల విద్యాధికారులు (ఎంఈవోలు), ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు వివరించారు. పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, ఫర్నిచర్, పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు అవసరమైన ఇతర వసతుల కల్పనపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అధికారులతో కలిసి సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు, మండల విద్యాధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
