AP | చిన్నారిపై దారుణం.. నిందితుడికి సహజ మరణం వరకు జీవిత ఖైదు

పోక్సో కోర్టు సంచలన తీర్పు.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
వేగంగా దర్యాప్తు చేసి నేరం రుజువు చేసిన పోలీసులు
మహిళలు, చిన్నారులపై నేరాలకు ఇది గట్టి హెచ్చరిక: ఎస్పీ సుబ్బారాయుడు
దర్యాప్తు బృందాన్ని అభినందించిన జిల్లా పోలీసు అధికారి


AP | తిరుపతి క్రైమ్ (ఆంధ్రప్రభ): వడమాలపేట మండలం ఏ.ఎం.పురం గ్రామంలో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సహజ మరణం వరకు జీవిత కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుందని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు.

2024 నవంబర్ 1న అదృశ్యమైన మూడున్నరేళ్ల చిన్నారి కేసును తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు వరుసకు మామ అయిన పాముల నాగరాజు అలియాస్ సుశాంత్ బిస్కెట్లు కొనిస్తానని చెప్పి గ్రామ శివారులోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. అప్పటి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు. పుత్తూరు డీఎస్పీ జి. రవికుమార్ నేతృత్వంలో పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు, వైద్య నివేదికలు, క్లూస్ టీం సేకరించిన వివరాలతో పటిష్టమైన సాక్ష్యాలను సమకూర్చారు. సంఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అనంతరం త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు కేసు విచారణను కూడా నిరంతరం పర్యవేక్షించారు.

కోర్టులో నేరం రుజువు కావడంతో చిత్తూరు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి సహజ మరణం వరకు జీవిత కఠిన కారాగార శిక్ష విధిస్తూ, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన డీఎస్పీ జి. రవికుమార్, ప్రత్యేక ప్రజా అభియోజకురాలు వి. మోహన కుమారి, కోర్టు సిబ్బంది, దర్యాప్తు బృందంలోని పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసులు పూర్తి కట్టుబాటుతో పనిచేస్తున్నారని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పోక్సో కేసుల నిందితులపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.