Check dam | నాణ్యత లోపం వల్లే చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి

Check dam | నాణ్యత లోపం వల్లే చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి

  • చెక్ డాం నాణ్యత పైన సమగ్ర విచారణ జరిపిస్తాం
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన చట్టపరమైన చర్యలు

Check dam | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : నాణ్యత లోపం వల్లే మంథని మండలం అడవి సోమన్ పల్లి చెక్ డ్యామ్(Check dam) కూలి పోయిందని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ రోజు మంథని మండలం అడవి సోమన్ పల్లి గ్రామంలోని చెక్ డ్యాంను మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. అడవి సోమన్ పల్లి చెక్ డ్యామ్ గత ప్రభుత్వంలో నిర్మించిందని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) గుర్తు చేశారు. చెక్ డాం నాణ్యత లేకుండా కూలి పోయిందని చెక్ డ్యామ్ చూస్తుంటే అర్థమవుతుందని మంత్రి తెలిపారు.

అడవి సోమన్ పల్లి చెక్ డ్యాం కూలిపోయిన సంఘటనలో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని, సమగ్ర విచారణలో గ్రామస్తుల, ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో నిజ నిర్ధారణ చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేకుండా కట్టడం వల్లే చెక్ డాం కూలిపోయి ఉంటుందని, గత ప్రభుత్వం కమీషన్లకు ఆశపడి చెక్ డ్యామ్ నాణ్యతను గాలికి వదిలేసిందని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం నిర్మించిన నాణ్యతలేని కాళేశ్వం ప్రాజెక్ట్(Kaleshwam Project), మంథని నియోజకవర్గంలోని చెక్ డాంల వల్ల ఎన్ని పొలాలు బాగుపడ్డాయో, ఎవరు లాభపడ్డారు ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరికోసం చెక్ డ్యాంలు నిర్మించారో, ఎవరి లాభం కోసం, ఎవరి కమిషన్ల కోసం నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టారు సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత వివరిస్తామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

అధికారులు ఎలాంటి ఒత్తిడి లేకుండా చెక్ డ్యాం నాణ్యత పైన సమగ్ర విచారణ జరిపి త్వరగా రిపోర్టు సమర్పించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వమని, రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా లాభపడాలో ఆలోచనతో ముందుకు వెళ్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక సర్పంచ్ గట్టు దామోదర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ(Market Committee) చైర్మన్ కుడుదల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కోఆర్డినేషన్ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు సెగ్గం రాజేష్, ఉప్పట్ల శ్రీనివాస్, తొట్ల తిరుపతి యాదవ్, మంథని సత్యం, యువజన విభాగం మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply