మానవ సమాజపు ఆత్మీయబంధమే చాగంటి రామలింగేశ్వరరావు.

మానవ సమాజపు ఆత్మీయబంధమే చాగంటి రామలింగేశ్వరరావు.
వీడ్కోలు వేడుకలో కుమార్ చొరవకు పురాణపండ ప్రశంస !
హైదరాబాద్, ఆంధ్రప్రభ : విపరీత స్వార్ధాల వికృత మనస్తత్వాలతో , వెక్కిరింతలతో , దెప్పి పొడుపులతో , అసూయా ద్వేషాలతో నూటికి డెబ్భై శాతంపై చిలుకుగా ఇతరుల జీవితాల్ని తగలబెట్టేస్తున్నారని…. ఇది మానవ సమాజపు ఆత్మీయ బంధాలకు విఘాతమని ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ సూటిగా స్పష్టంగా పేర్కొన్నారు.
వందలాది బ్యాంక్ ఉద్యోగుల , ఉన్నతాధికారుల మధ్య హైదరాబాద్ తాజ్ మహల్ లో జరిగిన ఇండియన్ బ్యాంక్ స్పెషల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ చాగంటి రామలింగేశ్వరరావు పదవీ విరమణ మహోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు పరిచయమున్న బ్యాంకింగ్ వ్యవస్థలో చాగంటి రామలింగేశ్వరరావు వంటి వినయసంపన్నుని, వృత్తిపట్ల సంపూర్ణ నిబద్ధత ఉన్న మానవవిలువల సంస్కారవంతుని, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా కష్టమర్లకు ఎంతో ఎంతెంతో సహకరించే సహృదయుణ్ణి చూడలేదని … ఎన్నోసలక్షణాలు నిండిన చాగంటి రామలింగేశ్వరరావు వంటి మంచి వ్యక్తిని పరిచయం చేసిన ఇండియన్ బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎమ్మెస్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
తన సొంత బిడ్డలా రామలింగేశ్వరరావు కు ఇంతటి ఘన వేడుకను నిర్వహించడంలో ప్రధాన సూత్రధారి మద్దులపల్లి సత్యకుమార్ ను ఈ సందర్భంగా శ్రీనివాస్ అభినందిస్తూ కుమార్ కొన్నేళ్ల పాటు గణేష్ నిమజ్జనం సందర్భాల్లో వేల కొలది ప్రజలకు చేసిన ఆహారపొట్లాలసేవ , వేసవిలో చలివేంద్రంసేవ అలహాబాద్ బ్యాంకు , ఇండియన్ బ్యాంకుల చరిత్రలో మైలురాళ్ళని అభినందనలు వర్షించారు.

చాగంటి రామలింగేశ్వరరావుకు అత్యంత ఆత్మీయుడైన ఇండియన్ బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అధ్యక్షులు ఎమ్మెస్ కుమార్ మాట్లాడుతూ… దశాబ్దాల తమ స్నేహంలోని కొన్ని ఘట్టాలను ఎంతో ఆర్ద్రతతో , ఆత్మబంధంగా , కనులు చెమ్మగిల్లేలా వివరించారు. విజ్ఞత , మర్యాద విలువలు తెలిసిన రామలింగేశ్వరరావుతో మా అనుబంధం విడదీయలేనిదని, అత్యంత గాఢమైన మైతీభావం ఉండటం వల్లనే ఆయన పదవీ విరమణకు ఇంతమంది వివిధ బ్యాంకుల సిబ్బంది వచ్చామని ఎంతోమంది ఉద్యోగులు స్పష్టంగా పేర్కొన్నారు.
ఎమ్ . ఎస్. కుమార్ సంపూర్ణ పర్యవేక్షణలో … శ్రీభారతి ఫౌండేషన్ చైర్మన్ , ప్రముఖ గాయకులు చింతలపాటి సురేష్ అపూర్వ రసభరిత గీతాలాపనతో… ఇండియన్ బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యూనియన్ కార్యదర్శి పి . వి. కృష్ణారావు, సహకార్యదర్శి నల్లపురెడ్డి , రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి టి. జనార్దనసింగ్, ఎమ్.ఎస్.ఎస్. నరసింగరావు , ఎమ్.శశికుమార్, పి. పిచ్చయ్యల ఉత్సాహవంతమైన ప్రోత్సాహ భూమికతో సుమారు నాలుగు గంటలపాటు ఎంతో నవోన్మేషంగా , కుటుంబ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో చాగంటి రామలింగేశ్వర రావు , శ్రీమతి జ్యోతి దంపతులను బ్యాంకు ఉన్నతాధికారులు మొదలు అటెండర్ స్థాయి ఉద్యోగి వరకు ఎంతోమంది పూల మాలలతో , శాలువాలతో , పుష్పగుచ్ఛాలతో, బహుమతులతో ఘనంగా సత్కరించిన సన్నివేశం అందరినీ ఆశ్చరంతోపాటు ఆనందింపచేయడం ప్రత్యేకంగా చెప్పక తప్పదు.
మున్ముందుగా ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత రచనా సంకలనం శ్రీమాలిక దివ్యగ్రంధం ముప్పై నాలుగవ ప్రచురణను ఇండియన్ బ్యాంకు ఎంప్లాయిస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యూనియన్ అధ్యక్షులు ఎమ్మెస్ కుమార్ ఆవిష్కరించి తొలిప్రతిని శ్రీభారతి సాంస్కృతిక సంస్థ సంస్థాపక కార్యదర్శి చింతలపాటి సురేష్ కు అందజేయడం సభలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్.ఎస్.ఎస్. నరసింగరావు సమర్పణా భావంతో ఈ శ్రీమాలిక మంగళ గ్రంధాన్ని ఆహ్హూతులందరికీ ఉచితంగా పంచారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ స్వర్ణప్రభ సుందర్ రాయ్ , బ్యాంకు అఫ్ బరోడా ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి పెద్దాడ అజేయ కుమార్ , హిమాయత్ నగర్ బ్రాంచ్ ఏ జి ఎమ్ కనిగిచర్ల రామకృష్ణ , జోనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ కంతూరి శేఖర్ బాబు , మరొక ఉన్నతాధికారి బోండా రాంబాబు , చాగంటి కుటుంబ సభ్యులు పరమ సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసారు.
