అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తప్పవు

  • డివిజన్ సహాయ వ్యవసాయ సంచారకులు అజ్మీర శ్రీనివాసరావు
  • విత్తన,ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు

కేసముద్రం, ఆంధ్రప్రభ: కేసముద్రం మండలంలోని పలు విత్తన,ఎరువుల దుకాణాలను మహబూబాబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచారకులు అజ్మీర శ్రీనివాసరావు , మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పలు విత్తన, ఎరువుల షాపులలో విత్తన ఎరువుల నిల్వలకు సంబంధించి స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, ఇన్వాయిస్లు, పిఓఎస్ మిషన్ బ్యాలెన్స్, గోదాము బ్యాలెన్స్, స్టాక్ బోర్డులను తనిఖీలు చేపట్టారు.

రైతులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల వరి సన్నధాన్యాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఎరువుల డీలరు రైతులకు విధిగా, విత్తన ఎరువుల బిల్లులు ఇవ్వాలని, రైతులు కూడా తప్పనిసరిగా బిల్లును తీసుకొని పంట కాలం పూర్తి అయ్యేంతవరకు భద్రపరచుకోవాలని సూచించారు.

డీలర్లు తప్పకుండా ఎరువుల స్టాక్ రిజిస్టర్ నిల్వలు పీఓఎస్ నిల్వలు, గోదాం బ్యాలెన్స్ నిల్వలు సమానంగా ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. ప్రతి ఎరువుల డీలరు ఎరువుల కంపెనీకి సంబంధించిన ఓ ఫామ్ లను ఎరువుల లైసెన్స్ లో పొందుపరచుకోవాలని అదేవిధంగా, కొత్తగా గోదాములను తీసుకున్నట్లయితే అటువంటి గోదాములను ఎరువుల లైసెన్స్ లో తప్పకుండా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

డీలర్లు కనీస మద్దతు ధరకు మాత్రమే ఎరువులను అమ్మాలని, ఎవరైనా డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయించినట్లైతే ఎరువుల నియంత్రణ చట్టం 1985, నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.