Crop Residues | పంట అవశేషాల దహనం.. భూమికే కాదు, రైతుకూ నష్టమే!

Crop Residues | పంట అవశేషాల దహనం.. భూమికే కాదు, రైతుకూ నష్టమే!
- భూగర్భంలో ‘సేంద్రీయ’ సంక్షోభం
- మిత్రపురుగులు సజీవ దహనం..
చౌటుప్పల్, (ఆంధ్రప్రభ) : పంట కోతల తర్వాత పొలాల్లో మిగిలిపోయే వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల భూమికే కాకుండా, రైతులకు కూడా దీర్ఘకాలంలో భారీ నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొలాలను త్వరగా శుభ్రం చేసుకునేందుకు చాలామంది రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టే సులువైన మార్గాన్ని ఎంచుకుంటున్నప్పటికీ.. ఇది నేల ఆరోగ్యంపై, పర్యావరణంపై కోలుకోలేని దెబ్బ తీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘సేంద్రీయ’ సంక్షోభం..
పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వాటిలో ఉండే అత్యంత విలువైన ఆర్గానిక్ కార్బన్ పూర్తిగా నశిస్తుంది. నేల సారవంతంగా ఉండాలన్నా, తేమను పట్టి ఉంచే నీటి నిల్వ సామర్థ్యం పెరగాలన్నా సేంద్రీయ పదార్థం ఎంతో అవసరం. పంట కాల్చడం వల్ల నేల తన సహజ నిర్మాణాన్ని కోల్పోయి చవిటి నేలగా, సారహీనంగా మారిపోతుంది.
మిత్ర పురుగులు, సూక్ష్మజీవుల నాశనం
వ్యర్థాలను తగలబెట్టినప్పుడు పొలంలో పుట్టే అధిక ఉష్ణోగ్రతలు నేల పైపొరల్లో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా, ఫంగస్, వానపాములను సజీవ దహనం చేస్తాయి. ప్రకృతి సిద్ధంగా భూమికి నైట్రోజన్‌ను స్థిరీకరించే, సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేసే ఈ సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమి ఉత్పాదకత దారుణంగా పడిపోతుంది.
రసాయనాలకు పెరిగే ఖర్చు
కాల్చడం వల్ల పంట వ్యర్థాల్లో ఉండే నైట్రోజన్, సల్ఫర్ వంటి ప్రధాన పోషకాలు వాయువుల రూపంలో వాతావరణంలో కలిసిపోతాయి. ఫాస్ఫరస్, పొటాషియం కూడా చాలావరకు నష్టపోవాల్సి వస్తుంది. ఫలితంగా తర్వాతి పంటకు రైతు పెట్టుబడి పెంచి, కెమికల్ ఎరువులపై అదనంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కాల్చొద్దు.. కరిగించి ఎరువుగా మార్చండి!
పంట వ్యర్థాలను తగలబెట్టే అలవాటును రైతులు ఇకనైనా మానుకోవాలని, నిపుణులు చెప్పే పద్ధతులను పాటించాలని చౌటుప్పల్ డివిజన్లోని సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయ అధికారి బి. పూజ కోరారు. వరి కోతల తర్వాత పొలంలో మిగిలిన వ్యర్థాలను రెండు మూడు రోజుల పాటు నీటిలో నానబెట్టాలి. ఆపై ఎకరాకు సరిపడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లి కలియ దున్నుకుంటే.. ఆ వ్యర్థాలన్నీ కుళ్లిపోయి తర్వాతి పంటకు అద్భుతమైన పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడతాయి.
దీనివల్ల అటు భూమి సారం పెరగడంతో పాటు ఇటు రైతుకు ఎరువుల ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని సూచిస్తున్నారు. రైతులు వాస్తవాలను గుర్తించి పంట అవశేషాలను కాల్చడం మానుకోవాలని ఏఓ పూజ కోరారు.

