బి ఆర్ ఎస్ తోనే మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కారు గుర్తుకు ఓటు వేస్తే …కాంగ్రెస్ చెంప మీద కొట్టినట్టే

  • బిఆర్ఎస్ అభ్యర్థుల పై బెదిరింపులకు పాల్పడితే సహించం
  • కేసులకు భయపడేది లేదు… కాంగ్రెస్ నాయకులారా ,పోలీసులారా తస్మాత్ జాగ్రత్త
  • ఎన్నికల ప్రచార సభలో మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్
    మోత్కూర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నూతన మున్సిపాలిటీగా ఆవిర్భవించి అభివృద్ధి జరిగిందని, గత రెండేళ్లలో కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు .శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తన హయాంలోనే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులతోనే మోత్కూర్ లో అభివృద్ధి పనులు జరిగాయని తాను వేసిన శిలాఫలకాలను తీసేసి , కొత్త శిలాఫలకాలు వేసి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు .
  • తాను, తన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ఎక్కడ కూడా కాంట్రాక్టు పనులు చేపట్టలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే సామెల్ కుమారులు కాంట్రాక్టర్లు గా అవతారం ఎత్తి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ హయాంలోనే మినీ ట్యాంక్ బండ్, వైకుంఠధామం ,ధోబి ఘాట్ , నూతన మున్సిపల్ కార్యాలయం ,వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ,అగ్నిమాపక కేంద్రం ఏర్పడ్డాయని తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని పనికిరాని వాళ్లకు టికెట్ ఇచ్చారన్నారు . ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వ్యాపారస్తుల వద్ద డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు .
  • అధికార దాహంతో ఓ నాయకుడు అన్ని పదవులు తనకే రావాలి అంటూ ఏకంగా ఓ వార్డులో కౌన్సిలర్ స్థానానికి నామినేషన్ వేసి ఉపసంహరణ చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తన హయాంలో తాను ప్రజలకు నిత్యం ఎల్లవేళలా అందుబాటులో ఉండేవాడినని, ప్రస్తుత ఎమ్మెల్యే చీకటి అయితే చాలు దొరకరని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ పిట్ట పిల్ల అని, మాజీ సీఎం తెలంగాణ జాతిపిత కెసిఆర్ ను తిడుతూ నిత్యం కెసిఆర్ జపం చేయడమే సీఎం రేవంత్ లక్ష్యమన్నారు. రేవంత్ అహంకారం, పొగరు, బలుపు మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. వాల్ రైటింగ్, గోడలకు సున్నం వేసిన రేవంత్ తెలంగాణ ప్రజలకు సున్నం పెడుతున్నారన్నారు .
  • మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయకుండా బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని, మా అభ్యర్థి మరియన్నను ఎదుర్కొనే ధైర్యం లేకే ఆ వార్డులో ఓ అభ్యర్థి నామినేషన్ సైతం వేయడానికి ముందుకు రాలేదన్నారు . బిఆర్ఎస్ అభ్యర్థుల పట్ల బెదిరింపులకు పాల్పడితే కాంగ్రెస్ నాయకులారా, పోలీసు లారా తస్మాత్ జాగ్రత్త మరో రెండేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం లోకి రావడం ఖాయమని, మీ సంగతి చూస్తా అని మాజీ ఎమ్మెల్యే కిషోర్ సవాల్ విసిరారు . ఎమ్మెల్యే కాకముందే ఉద్యమ సమయంలో తనపై 170 కేసులు ఉన్నాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో 22 కేసులు పెట్టారని కేసులకు భయపడేది లేదని , కాంగ్రెస్ నాయకులరా తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు .
  • కారు గుర్తుకు ఓటు వేస్తే కాంగ్రెస్ పై చెంప దెబ్బ కొట్టినట్టేనన్నారు.కడుపులో తలకాయ పెట్టి అడుగుతున్న మా బిఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి, మోత్కూర్ మున్సిపాలిటీలో అవినీతికి తావు లేకుండా గులాబీ జెండా ఎగిరేందుకు మున్సిపల్ ప్రజలు తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.బిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కిషోర్ హయాంలోనే తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు . కాంగ్రెస్ ఎన్నికల హామీలతో ప్రజలు మోసపోయారని, కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దన్నారు.
  • కాంగ్రెస్ హామీలలో ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అయితే ,మగవాళ్లకు డబల్ చార్జీలు వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సిపిఎం రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే మోత్కూరు మున్సిపాలిటీ ఆవిర్భవించిందని, రోడ్లు, విద్యుత్ వెలుగులు, కిషోర్ పుణ్యమేనని ,కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రెండేళ్లలో అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు.బి ఆర్ ఎస్ తోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని,రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో గాదరి కిషోర్ కుమార్ కు మోత్కూర్ మున్సిపాలిటీని కానుకగా ఇవ్వాలని కోరారు .పేద ప్రజల కమ్యూనిస్టు జెండాకు బిఆర్ఎస్ అండగా నిలిచిందన్నారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేవురి ధర్మేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో మాజీ మార్కెట్ చైర్మన్ లు తీపి రెడ్డి మేఘారెడ్డి , కె యాకుబ్ రెడ్డి, మహేంద్ర నాథ్, బి ఆర్ ఎస్ మండల , పట్టణ అధ్యక్షులు పొన్నబోయిన రమేష్ , జంగ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పిచ్చయ్య, సిపిఎం రాష్ట్ర నాయకులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, రాచకొండ రాములమ్మ, గుండు వెంకట నర్సు, బిఆర్ఎస్ సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థులు,నాయకులు మర్రి అనిల్ కుమార్, ధబ్బేటి రమేష్, మల్లం అనిత,శైలజ,ఇంద్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు