రైతు నేలకే సార.. పంటకు శాస్త్రీయ భరోసా!
పశ్చిమలో జిల్లా స్థాయి భూసార పరీక్షా ప్రయోగశాలకు శ్రీకారం
రూ.కోటి అంచనా వ్యయంతో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
ఎన్‌టీఆర్ జిల్లా రైతులకు భూసార విశ్లేషణ, పోషకాలపై శాస్త్రీయ సూచనలు
భవానిపురం, ఆంధ్రప్రభ : రైతు పంటకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో.. ఆ పంటకు ఆధారమైన నేల సారానికీ అంతే ప్రాధాన్యం. ఈ నేపథ్యంలో ఎన్‌టీఆర్ జిల్లా రైతులకు భూసార పరీక్షలు, భూమిలోని పోషక విలువల విశ్లేషణను మరింత చేరువ చేసేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో జిల్లా స్థాయి భూసార పరీక్షా ప్రయోగశాల భవన నిర్మాణానికి చర్యలు వేగం పుంజుకున్నాయి. సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భవనం అందుబాటులోకి వస్తే రైతులకు తమ భూమి స్వభావం, పోషకాల స్థాయిపై శాస్త్రీయ సమాచారం అందడంతో పాటు పంటలకు అవసరమైన పోషకాల వినియోగంపై నిపుణుల సూచనలు పొందే అవకాశం ఏర్పడనుంది.
నాణ్యతతో.. వేగంగా నిర్మాణం..
నూతన ప్రయోగశాల భవన నిర్మాణానికి సంబంధించిన అంచనా వ్యయం, నిర్మాణ అనుమతులు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులు గురువారం తాడిగడపలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వివరించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకన్న, అసిస్టెంట్ ఇంజినీర్ శివరామకృష్ణ, కాంట్రాక్టర్ మండవ భార్గవ్ తదితరులు భవన నిర్మాణ ప్రతిపాదనలను ఎమ్మెల్యేకు వివరించారు. ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలోని రైతులకు మట్టి నమూనాల పరీక్షలు నిర్వహించి, భూమిలోని పోషక విలువలను నిర్ధారించేందుకు ప్రయోగశాల కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. భవన నిర్మాణంలో ఎక్కడా నాణ్యతకు రాజీ పడవద్దని ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులను ఆదేశించారు. సాంకేతిక నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పటిష్టంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రయోగశాల అందుబాటులోకి వస్తే రైతులు తమ భూమిలో ఏ పోషకాలు లోపించాయి, ఏ పంటకు ఎలాంటి పోషకాలు అవసరం అనే విషయాలపై శాస్త్రీయ అవగాహన పొందే అవకాశం ఉంటుంది. తద్వారా అవసరానికి మించి ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు ఈ ప్రయోగశాల దోహదపడే అవకాశం ఉంది.
