BNSS Act | ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి…

BNSS Act | ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి…
BNSS Act | మోత్కూర్, ఆంధ్రప్రభ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం నిర్వహించనున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు ఎన్నికల అధికారుల(election officials)కు, పోలీసులకు సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ ఆకాంక్ష యాదవ్ అన్నారు. ఈ రోజు మండలంలోని పాటిమట్ల పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ సందర్శించారు.
గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని సీఐ వెంకటేశ్వర్లును డీసీపీ ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు నిరంతరం పెట్రోలింగ్(patrolling) నిర్వహిస్తూ, సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో అల్లర్లకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉదయం పోలింగ్ మొదలు కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు, పోలింగ్ సామాగ్రి డిఆర్సి కేంద్రాలకు చేరేవరకు పోలీసుల అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్(BNSS Act) అమల్లో ఉంటుందని, 200 మీటర్ల(200 meters) పరిధిలో అనవసర రాకపోకలను అనుమతించవద్దన్నారు.
పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు,ఇంకు బాటిల్స్ ఇతర హానికర వస్తువులు తీసుకురాకుండా పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. కౌంటింగ్(Counting) అనంతరం గెలుపొందిన అభ్యర్థులు గ్రామాల్లో విజయోత్సవ ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వొద్దన్నారు. ఈ సందర్భంగా డిసిపి వెంట అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, సిఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
