ఐఐఐటీ శ్రీకాకుళంలో అడ్మిషన్ల సందడి..
తొలి రోజే 500 మందికి కౌన్సిలింగ్ పూర్తి
రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థుల రాకతో క్యాంపస్‌లో సందడి
ఎచ్చెర్ల, ఆంధ్రప్రభ: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐఐటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సు ప్రవేశాల కౌన్సిలింగ్ మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో క్యాంపస్ ప్రాంగణం సందడిగా మారింది.
కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముందుగా టోకెన్లు కేటాయించి లోపలికి అనుమతించిన అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, కుల ధృవీకరణ పత్రాల తనిఖీ, ఆన్లైన్ ఫీజుల చెల్లింపు ప్రక్రియలను పూర్తి చేసి అడ్మిషన్లు కల్పించారు.
శ్రీకాకుళం క్యాంపస్‌లో తొలి అడ్మిషన్‌ను పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నానికి చెందిన వి. ప్రీతి దక్కించుకోగా, అనకాపల్లి జిల్లాకు చెందిన సి.హెచ్. దీక్షిత్ ధర్మతేజ రెండో అడ్మిషన్ పొందారు. వీరికి వర్సిటీ డైరెక్టర్ గిరిధర్ మద్రాసు అడ్మిషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా అడ్మిషన్ల కన్వీనర్, రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ, శ్రీకాకుళం క్యాంపస్‌లోని సీట్ల భర్తీ కోసం రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి రోజున 500 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ పూర్తి చేశామని, బుధవారం మరో 500 మందికి కౌన్సిలింగ్ నిర్వహించడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో క్యాంపస్ పరిపాలనా అధికారి డా. ముని రామకృష్ణ, డీన్ డా. శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డా. వాసు, వెల్ఫేర్ డీన్లు ప్రకాశరావు, యోగేశ్వరి, వివిధ విభాగాల కో-ఆర్డినేటర్లు, సిబ్బంది, విద్యార్థి వాలంటీర్లు పాల్గొన్నారు.
