Mangapuram | సెక్యూరిటీ గార్డు దారుణ హత్య…
ఇంట్లోకి చొరబడి హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు..
కేకలు వేయడంతో పరారీ
Mangapuram | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు రూరల్ మండలం తాళంబేడు గ్రామపంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. పట్టాభి నాయుడు ఇంటికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తెనాలికి చెందిన ఆనందరావు అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఇంట్లో ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మంగాపురం గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
మంగాపురం గ్రామంలో పట్టాభి నాయుడు నివాసానికి ఆనందరావు కొంతకాలంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వద్దకు చేరుకుని ఆనందరావుపై దాడి చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దుండగులు సెక్యూరిటీ గార్డును హత్య చేసిన సమయంలో ఇంట్లో ఉన్న వారు ఘటనను గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
పట్టాభి నాయుడు కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన స్వగ్రామానికి వచ్చిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డుగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుండగులు హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది పాత కక్షలా, దోపిడీ ప్రయత్నమా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న చిత్తూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆనందరావు ఎవరితోనైనా విభేదాలు కలిగి ఉన్నారా, ఇటీవల ఆయనను ఎవరైనా బెదిరించారా అనే విషయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. దుండగులు ఎంతమంది వచ్చారు.. ఏ వాహనంలో వచ్చారు.. హత్య అనంతరం ఏ మార్గంలో పరారయ్యారు అనే వివరాలను సేకరిస్తున్నారు. అలాగే మృతుడు ఆనందరావు స్వస్థలం తెనాలి కావడంతో ఆయన వ్యక్తిగత, కుటుంబ నేపథ్యంపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
