AP | పాగోలులో కూలిన 120ఏళ్ల రావి చెట్టు…
డీలర్ ఇంటి పక్కన పడిన భారీ చెట్టు
ఇంటిపై చెట్టు కొమ్మలు పడిన ధాటికి పగిలిన గోడ, పైకప్పు రేకులు
ఇంటిలో నిద్రిస్తున్న రాధాకృష్ణ కుటుంబంపై పడిన రాళ్లు
ప్రమాదంలో ఆరేళ్ళ చిన్నారి చర్వితశ్రీకి గాయాలు
మచిలీపట్టణం ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
AP | చల్లపల్లి – ఆంధ్రప్రభ : 120ఏళ్ల రావి చెట్టు విరిగి చిన్నారికి గాయాలైన ఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పాగోలులో జరిగింది. శనివారం తెల్లవారుజామున పాగోలు గ్రామ పంచాయతీ వెనుక ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో ఉన్న 120సంవత్సరాల వయసు కలిగిన భారీ రావి చెట్టు ఆకస్మాత్తుగా కూలిపోయింది. విరిగిన చెట్టు రోడ్డుకు అవతల ఉన్న రేషన్ డీలర్ పాగోలు కళ్యాణి -రాధాకృష్ణ కుటుంబం నివసించే రేకుల పైకప్పు కలిగిన ఇంటి ఆవరణలో పడింది.

భారీ చెట్టు కావటంతో బరువైన కొమ్మలు వారి ఇంటిపై పడి, ఈ ధాటికి పైకప్పు రేకులు పగిలిపోయాయి. ఇంటి గోడ విరిగి రాళ్లు లోపల ఉన్న మంచంపై నిద్రిస్తున్న వారిపై పడ్డాయి. ప్రమాదంలో రాధాకృష్ణ, కళ్యాణి, పెద్ద కుమార్తె స్వల్ప గాయాలకు గురి కాగా, వారి రెండో కుమార్తె ఆరేళ్ళ చర్వితశ్రీ తీవ్ర గాయాలకు గురైంది. ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటీన మచిలీపట్టణం ఆసుపత్రికి తరలించారు.

చెట్టు విద్యుత్ తీగలపై పడి ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో విద్యుత్ సిబ్బంది పునరుద్దరణ చర్యలు చేపట్టారు. గంగానమ్మ ఆలయం ఆవరణలో 120ఏళ్లుగా పూజలు అందుకుంటున్న భారీ రావి చెట్టు కూలిపోవటంతో గంగానమ్మ అమ్మవారి కమిటీ పెద్దలు మేకా కమలాకర్ రావు (పెద్దబ్బాయి), వక్కలగడ్డ శివరామకృష్ణ, మేకా శ్రీనివాసరావు, మేకా వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో రావి చెట్టును శాస్త్రోక్తంగా తొలగించే పనులు చేపట్టారు.
