మైనర్ల చేతికి బైక్ ఇవ్వొద్దు.. ప్రాణాలతో చెలగాటం వద్దు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : సరైన వయసు, అవగాహన, శిక్షణ లేకుండా వాహనం నడిపితే అది వాహనం కాదు.. ప్రమాదకర ఆయుధమే. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లలు సరదా, స్నేహితుల మెప్పు కోసం బైక్‌లు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. తమ ప్రాణాలను కోల్పోవడంతోపాటు ఎదుటివారి ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు.
తమ స్థాయికి మించి చదువులు చెప్పించి, పిల్లలు అడిగినవన్నీ అందిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటారు. అయితే అదే పిల్లలు ‘అమ్మా.. బయటికి వెళ్లొస్తా’ అంటూ ఇంటి నుంచి వెళ్లి, కొద్దిసేపటికే విగతజీవులుగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణనాతీతం. టెన్త్ పాస్ అయ్యాడని, ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయని ముచ్చటపడి కోరుకున్న బైక్‌ను కొనిచ్చే తల్లిదండ్రులు.. ఆ వాహనం పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పిల్లలపై ప్రేమతో వాహనం కొనివ్వడం కంటే, వారి ప్రాణాలను కాపాడటం తల్లిదండ్రుల మొదటి బాధ్యతగా గుర్తించాలి.
రోడ్లపై అడ్డదిడ్డంగా డ్రైవింగ్..

కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బైక్‌లపై పరిమితికి మించి ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, ముగ్గురు ప్రయాణించడం వంటి నిబంధనల ఉల్లంఘనలు ప్రమాద తీవ్రతను మరింత పెంచుతున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
మైనర్లు పట్టుబడితే కేసులు..
టేకుమట్ల ఎస్సై అమూల్య మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే జరిమానాతోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లు మరోసారి వాహనం నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాహన లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పిల్లల చేతికి వాహనం ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. వారి భవిష్యత్తు బైక్ చక్రాల కింద నలిగిపోకుండా కాపాడండి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం క్షణకాలమే.. కానీ దాని విషాదం జీవితాంతం వెంటాడుతుంది.
