సర్దార్ గౌతు లచ్చన్నకు పోలీసుల నివాళులు..

  • సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సామాజిక అసమానతల నిర్మూలనకు, పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి గౌతు లచ్చన్న చేసిన విశేష కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో జన్మించి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన సర్దార్ గౌతు లచ్చన్న సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు విశేష కృషి చేశారని తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచి, వారి హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నర్సింగరావుతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.