కొల్లేరు లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు

మండవల్లి, ఆంధ్రప్రభ: కొల్లేరు లంక గ్రామాల ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. గత 40 ఏళ్లుగా ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్న పెనుమాకలంక గ్రామస్థుల కల ఆదివారం సాకారమైంది. ఎవరో వచ్చి సమస్యను పరిష్కరిస్తారని ఎదురుచూడకుండా గ్రామస్థులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చేపల చెరువు రైతు రంగరాజు ఆధ్వర్యంలో అభయారణ్య పరిధిలోని పెద్ద ఎడ్లగాడి నుంచి పెనుమాకలంక వరకు దాదాపు రూ.80 లక్షల వ్యయంతో కంకర, మట్టి రహదారిని నిర్మించారు.

అలాగే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చొరవతో రూ.7 కోట్ల నిధులతో ఇంగిలిపాక లంక వరకు నాణ్యమైన బీటీ రహదారి నిర్మాణం చేపట్టడంతో లంక గ్రామాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో గ్రామ మాజీ సర్పంచ్‌లు ఘంటసాల శ్రీనివాసరావు, వెంకటరాజు, ఇతర గ్రామ పెద్దలు కలిసి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఏలూరు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రెడ్డి అప్పలనాయుడును కలిసి లంక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

వారి ప్రయత్నాలు ఫలించి, లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించారు. ఆదివారం ఎమ్మెల్యే చేతుల మీదుగా బస్సు సేవలను ప్రారంభించడంతో గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పలువురు గ్రామస్థులు ఆనందభాష్పాలు కారుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, రంగరాజు, పూలరాజు, కొల్లిబాబి, ముంగర మల్లికార్జునరావు, మోరు వెంకన్న, గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.