జూడాల సమ్మె ఉధృతం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్!
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె మరింత ఉధృతమైంది. ఇప్పటికే సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉన్న జూనియర్ డాక్టర్లు.. రేపటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలకు కూడా దూరమైతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇన్ సర్వీస్ వైద్యులు, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని పీజీ వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించింది.
అలాగే సెకండరీ స్థాయి ఆస్పత్రుల నుంచి కూడా అవసరమైన వైద్యులను ప్రభుత్వ బోధనాస్పత్రులకు తరలించి సేవలు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా అత్యవసర విభాగం, ప్రమాదాల చికిత్స విభాగం, ఐసీయూ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
అయితే , వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాననికి వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత నాలుగు రోజులుగా సమ్మే చేస్తున్నారు. విరమణ వయసు పెంచడం వల్ల ఇలా చేయడం వల్ల యువతకు అవకాశాలు ఉండవన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.
