- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆర్సీబీ యాజమాన్యం, కేఎస్సీఏ
- క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
- మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటన
ఆంధ్రప్రభ, బెంగళూరు : బెంగళూరులో ఐపీఎల్ 2025 విజయోత్సవాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు టైటిల్ గెలుచుకున్న ఆనందం అభిమానులకు కొన్ని గంటలు కూడా నిలవలేదు. బుధవారం నగరంలోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన సంబరాల్లో భారీ తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆనందంలో పాలుపంచుకోవడానికి దాదాపు రెండు లక్షల మంది అభిమానులు బుధవారం చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి, పలువురు అభిమానులు కిందపడిపోయారు. ఊపిరాడక కొందరు, తీవ్ర గాయాలపాలై మరికొందరు ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనతో బెంగళూరు నగరంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పటి నుంచి అంబరాన్నంటిన సంబరాలు బుధవారం నాటి ఈ దుర్ఘటనతో మూగబోయాయి.
ఆర్సీబీ, కేఎస్సీఏ దిగ్భ్రాంతి, ఆర్థిక సాయం ప్రకటన
ఈ దురదృష్టకర ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. “చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ రోజు నిర్వహించిన సంబరాల్లో జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల ఆర్సీబీ – కేఎస్సీఏ తీవ్ర ఆందోళన, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి” అని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
“ఈ ఘటనలో సంభవించిన ప్రాణ నష్టం, గాయపడిన వ్యక్తుల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ దుర్ఘటనతో నష్టపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం” అని ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్సీబీ, కేఎస్సీఏ యాజమాన్యాలు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాయి. “ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్సీబీ – కేఎస్సీఏ 5 లక్షల రూపాయలు ప్రకటించాయి. ఈ సహాయం వారి దుఃఖ సమయంలో కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాం” అని ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ఈ పరిహారం మానవ ప్రాణానికి విలువ కట్టడానికి ఉద్దేశించినది కాదని, కేవలం ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తమ మద్దతు, సంఘీభావం తెలియజేసేందుకేనని స్పష్టం చేశాయి. “ఈ పరిహారం మానవ ప్రాణానికి విలువ కట్టడానికి లేదా భర్తీ చేయడానికి ఉద్దేశించినది కాదని, ఇలాంటి క్లిష్ట సమయాల్లో మద్దతు, సంఘీభావం తెలిపే చర్య మాత్రమేనని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం” అని ఆ ప్రకటనలో తెలిపాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.