ప్రజల ఇబ్బందులను పట్టించుకోండి..

  • సమస్యలకు తక్షణ పరిష్కారం చూపండి..
  • పీజీఆర్‌ఎస్‌లో వైసీపీ ఫిర్యాదుల వర్షం
  • విజయవాడలో తాగునీరు, పారిశుద్యం, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల అంశాలపై వినతి
  • నగర సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతిపత్రం
  • అభివృద్ధి పనులు నిలిచిపోయాయని కూటమి ప్రభుత్వంపై విమర్శలు
  • ప్రభుత్వ స్థలాల కబ్జాలు, అక్రమ లేఔట్లపై చర్యలు కోరిన నేతలు
  • సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

(విజయవాడ కార్పొరేషన్, ఆంధ్రప్రభ) : విజయవాడ నగరంలో తాగునీరు, పారిశుద్యం, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాల కేటాయింపు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, నిలిచిపోయిన అభివృద్ధి పనులు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు అసిస్టెంట్ కమిషనర్‌ను కలిసి నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తాగునీటి కొరత, పారిశుద్ధ్య లోపాలతో డయేరియా కేసులు పెరుగుతున్నాయని, చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయమవుతున్నాయని, గతంలో మంజూరైన వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాలను అర్హులైన పేదలకు కాకుండా ఇతరులకు కేటాయిస్తున్నారని విమర్శించారు. కమ్యూనిటీ హాళ్లు పూర్తి కాక అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని, పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, నగరాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, కార్పొరేషన్ అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వర్షాకాలంలో కొండ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పార్కులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, భవనాల అనుమతుల పేరుతో భారీగా వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాలను అర్హులైన పేదలకు పంపిణీ చేయకుండా రాజకీయ ప్రాతిపదికన కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్లను సమీక్షించి అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అక్రమ లేఔట్లపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

పేదలకు ఇళ్ల పంపిణీ జరగకపోతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, తమ పాలనలో పేదలకు గృహాలు అందించామని, ప్రస్తుతం ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు. కార్పొరేషన్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందని, రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సేవలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. వినతిపత్రంలో ప్రస్తావించిన అంశాలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని నగర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.