నచ్చన్ ఎల్లాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం..

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడెం, పెత్తర్పు గ్రామాల్లో సోమవారం కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కే. శివకుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు సీజనల్ వ్యాధుల నివారణ, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.

సర్పంచ్ స్పందన గంగన్న మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి శాంత, ఎంఎల్‌హెచ్‌పీ బి. రేణుక, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు.