జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
నడిగూడెం, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు. నడిగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన నూతన ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాల విధానాల వల్ల జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి చట్టపరమైన రక్షణ కల్పించాలని, కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దున్న శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ ఎస్.ఎన్. మూర్తితో పాటు కమిటీ సభ్యులను జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా సన్మానించారు.
