Sensex | మార్కెట్లో బ్యాంకుల జోరు..
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బ్యాంకింగ్ రంగంపై మదుపర్లలో పెరుగుతున్న ఆశలు దేశీయ స్టాక్ మార్కెట్లకు కొంత మద్దతుగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగం మెరుగైన లాభాలను నమోదు చేసే అవకాశం ఉందనే అంచనాలతో ఆ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది.
దీంతో బ్యాంకింగ్ సూచీలు లాభాల్లో కదలాడుతుండగా, దేశీయ ప్రధాన సూచీలు కూడా స్వల్ప లాభాలను నమోదు చేస్తున్నాయి. అయితే సోమవారం మార్కెట్లు లాభాలతో ముగిసిన నేపథ్యంలో గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం మార్కెట్‌పై కొంత ఒత్తిడి పెంచింది.
ఇవాళ ఉదయం సెన్సెక్స్ గత ముగింపు 78,285 స్థాయితో పోలిస్తే దాదాపు 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అనంతరం కొంత తగ్గుముఖం పట్టి ఉదయం 9.30 గంటల సమయంలో 27 పాయింట్ల లాభంతో 78,312 వద్ద కొనసాగింది. మరోవైపు నిఫ్టీ కూడా స్వల్ప లాభాల్లో కదలాడుతోంది. ప్రస్తుతం 12 పాయింట్ల లాభంతో 24,442 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.33గా ఉంది.
సెన్సెక్స్, నిఫ్టీలో జుబిలెంట్ ఫుడ్స్, స్విగ్గీ, టైటాన్ కంపెనీ, ఎల్‌టీఎం, ఆల్కెమ్ ల్యాబ్స్ వంటి షేర్లు లాభాల్లో ఉండగా.. ట్రెంట్, కల్యాణ్ జువెల్లర్స్, కొచిన్ షిప్‌యార్డ్, బీఎస్ఈ లిమిటెడ్, వెర్నోవా టీడీ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో కదలాడుతుండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ మాత్రం దాదాపు 200 పాయింట్ల నష్టంలో ఉంది.
