మేడారంలో మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తాడ్వాయి,ఆంధ్రప్రభ: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి పూజారులు సంప్రదాయబద్ధంగా డోలు వాయిదాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం గద్దెల వద్ద సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. వనదేవతలకు నూతన వస్త్రాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ, ఎత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

