పోలీసుల ఆధ్వర్యంలో జాగృతి కళా ప్రదర్శన..

పోలీసుల ఆధ్వర్యంలో జాగృతి కళా ప్రదర్శన..

పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని అవుతాపురం గ్రామంలో సోమవారం మూఢ నమ్మకాలు, సామాజిక రుగ్మతల నిర్మూలన, సోషల్ మీడియా ద్వారా మోసాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ బ్యాంకింగ్ మోసాలు తదితర అంశాల పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. మహబూబాబాద్ పోలీస్ జాగృతి కళా బృందం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పెద్దవంగర ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. మూడు గంటల పాటు కళా ప్రదర్శన కొనసాగింది. సమాజంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ మోసాలు, బాల్య వివాహాల పై కళాకారుల బృందం తమ ప్రదర్శనల ద్వారా ప్రజలకు వివరించి చైతన్య పరిచారు.

ఈ సందర్భంగా ఎస్సై ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలను నిర్మూలించి శాస్త్రీయ దృక్పథంతో కూడిన అవగాహన కల్పించేందుకు యువత, విద్యార్థులు, గ్రామీణ ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

సర్పంచ్ తోటకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అవుతాపురం, ఉపసర్పంచ్ గద్దల పరమేశ్వర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply