పీఎం సూర్య ఘర్ బిజిలి పై మైసంపేట్ గ్రామస్తులకు అవగాహన

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని కొత్త మైసంపేట్ గ్రామంలో మంగళవారం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పాల్ కరుణాకర్ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ వినియోగంపై గ్రామస్తులకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత మిగిలిన విద్యుత్తును విద్యుత్ శాఖకు విక్రయించే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగంతో కలిగే ప్రయోజనాలను వివరించారు.

మూడు కిలోవాట్ (3 కేవీ) సోలార్ వ్యవస్థ ఏర్పాటు కోసం 360 యూనిట్ల వరకు వినియోగించే విద్యుత్తుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని నిరుపేద గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెందూరు శ్రీకాంత్, కోవ ప్రవీణ్, కోవ మాణిక్ రావు, పెందూరు గంగారం, కే భీమ్ రావు, అత్రం భీమ్ రావు, ఆడ జగ్గారావు, మరుసుకోల కమలాకర్, చక్రం అశోక్, మిశ్రం కాశీరాం తదితరులు పాల్గొన్నారు.