జీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం

జీఎంసీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం
- ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు
గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ:
రాబోయే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని, సీట్ల కేటాయింపులో ఏ పార్టీకి అవకాశం వచ్చినా అందరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసమే శ్రమించాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కంటే ఏ వ్యక్తి పెద్దవాడు కాదని, టికెట్ ఆశించే నాయకులు గెలుపునే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవాలని హితవు పలికారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ప్రజాభిమానం, వారికున్న నమ్మకం ఆధారంగానే ఉంటుందని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, కష్టకాలంలో కూడా పార్టీ కోసం పనిచేసిన నిబద్ధత గలవారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే వారికి స్థానం ఉండదన్నారు.
కార్యకర్తలను కలుపుకుని వెళ్తూ, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని స్వచ్ఛమైన ప్రజా జీవితం గడిపే వారినే అభ్యర్థులుగా ముందుకు తెస్తామని డా. బూర్ల రామాంజనేయులు వివరించారు. వీటితో పాటు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ, యువతతో అనుసంధానమయ్యే నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వ్యక్తిగత ఇమేజ్, ప్రజల మద్దతు, బూత్ స్థాయి బలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థుల గెలుపు సామర్థ్యాన్ని బట్టి టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఒకవేళ టికెట్ రాకపోయినా నిరాశ పడకుండా, కూటమి అభ్యర్థి విజయం కోసం పనిచేసే వారినే నిజమైన నాయకులుగా గుర్తిస్తామని, భవిష్యత్తులో పార్టీ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. గుంటూరు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, కూటమి ప్రభుత్వ బలం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేస్తే గుంటూరు కార్పొరేషన్ మీద కూటమి జెండా ఎగరవేయడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
