Pulivendula | తప్పిన పెను ప్రమాదం…

pulivendula | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆదివారం స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పులివెందుల మార్కెట్ యార్డు సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఓ పాఠశాల బస్సుకు అకస్మాత్తుగా రెండు టైర్లు విడిపోయాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. టైర్లు ఊడిపోవడంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పే పరిస్థితి ఏర్పడినా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును సురక్షితంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది.

స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ విషయంలో సంబంధిత యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, నిర్వహణపై రవాణా శాఖ అధికారులు కఠినంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.