ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి..

  • మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర పాడి పరిశ్రమల, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సూచించారు.

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చింతాన్‌పల్లి సూర్యప్రకాశ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొక్కు లింగం సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో డాక్టర్ వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి ప్రభుత్వంపై విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని అన్నారు.

మండలంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని, గ్రామ కమిటీలను చురుకుగా నిర్వహిస్తూ యువత, మహిళలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షుడు చింతాన్‌పల్లి సూర్యప్రకాశ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొక్కు లింగంకు మంత్రి అభినందనలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నాయకులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజల మధ్య పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేష్ రెడ్డి, నాయకులు శివరామరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.