HBD | పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు : పవన్ కల్యాణ్

వెలగపూడి: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పుట్టినరోజు. 75వ జన్మదిన వేడుకలను జరుపుకొంటోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ పోస్ట్ చేశారు. చంద్రబాబుకు ఉన్న రాజకీయ, పరిపాలన అనుభవాల గురించి ఇందులో ప్రస్తావించారు. వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజన్‌కు అనుగుణంగా పరిపాలన సాగించగలదక్షుడిగా ప్రశంసించారు.
చంద్రబాబును అనితరసాధ్యుడిగా, దార్శనికుడిగా అభివర్ణించారు పవన్ కల్యాణ్. ఆయనకు అన్ని రకాలుగా కుంగిపోయిన రాష్ట్రాన్ని తన అపార రాజకీయ, పరిపాలన అనుభవంతో పునరుజ్జీవింపజేశారని పేర్కొన్నారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ది అగమ్యగోచరంగా తయారై, శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం అనేది చంద్రబాబులాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం, వేగం అద్భుతమని ప్రశంసించారు.రాష్ట్ర భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని పవన్ కల్యాణ్ కొనియాడారు.
వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్షును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ ట్వీట్ పెట్టారు.
ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబుకు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
