మొబైల్ రికవరీలో పోలీసులు మరోసారి సత్తా..

రూ.29.70 లక్షల విలువైన 141 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత
ఫోన్ పోతే వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచన

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు అండగా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రికవరీ చేసిన 141 మొబైల్ ఫోన్లను ఆయా బాధితులకు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ విభాగం సహకారంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. 2026 మే, జూన్ నెలల్లో మొత్తం 141 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, వాటి అంచనా విలువ రూ.29.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు. రికవరీ చేసిన ఫోన్లను న్యాయపరమైన ప్రక్రియ పూర్తిచేసి బాధితులకు అందజేయడం పోలీసు శాఖకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
మొబైల్ ఫోన్లు ఎలా పోగొట్టుకుంటున్నారనే అంశంపై 100 మంది బాధితులను పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు. చార్జింగ్‌కు పెట్టి మర్చిపోవడం వల్ల 20 మంది, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుండగా జారిపోవడం వల్ల 30 మంది, బస్సులు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలకు గురై 50 మంది ఫోన్లు కోల్పోయినట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.

మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌లో వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదు సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ కొనుగోలు బిల్ లేదా బాక్స్, ఐఎంఈఐ నంబర్ తప్పనిసరిగా అవసరమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఐఎంఈఐ నంబర్‌ను ప్రత్యేకంగా నోట్ చేసుకొని, బిల్, బాక్స్‌ను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. అపరిచితుల వద్ద నుంచి ఫోన్లు కొనుగోలు చేయకుండా, కొనుగోలు చేసే సందర్భంలో విక్రేత ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలని సూచించారు. అలాగే సీఈఐఆర్‌లోని ‘కేవైఎం’ (Know Your Mobile) సేవ ద్వారా ఐఎంఈఐ నంబర్‌ను పరిశీలించి, బ్లాక్‌లిస్టెడ్ లేదా చోరీకి గురైన ఫోన్ అయితే కొనుగోలు చేయకూడదని స్పష్టం చేశారు. మొబైల్ షాప్ యజమానులు కూడా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ప్రజలు, మొబైల్ షాపుల యజమానులు పోలీసులకు సహకరిస్తే మొబైల్ రికవరీ శాతాన్ని మరింత పెంచడం సాధ్యమవుతుందని ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, సీసీఎస్ సీఐ సతీష్ కుమార్, డీసీఆర్‌బీ సీఐ నరేంద్ర రెడ్డి, ఎస్‌బీ సీఐ వెంకటేశ్వరులు, సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ గోపినాథ్ రెడ్డి, సీఏటీ బృందం సభ్యులు శ్రీనివాసులు, షామీర్, చంద్రశేఖర్, సీసీఎస్ సిబ్బంది కృష్ణ నాయక్, నరశింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.