Telangana Assembly | అసెంబ్లీలో విప్‌లకు కొత్త కార్యాలయాలు
ప్రారంభించిన మంత్రులు
అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, వేముల వీరేశంకు శుభాకాంక్షలు
సభ నిర్వహణలో సమన్వయంతో పనిచేయాలని సూచన
మీడియా అడ్వైజరీ కమిటీ కార్యాలయం ప్రారంభం..
Telangana Assembly | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే వేముల వీరేశంకు కేటాయించిన ప్రత్యేక కార్యాలయాలను సోమవారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌లకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శాసనసభ కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ విప్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సభ్యుల మధ్య సమన్వయం నెలకొల్పడం, శాసనసభ్యులకు అవసరమైన మార్గనిర్దేశం చేయడం, ప్రభుత్వ శాసన కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో విప్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా అడ్వైజరీ కమిటీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించి, కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. శాసనసభ కార్యకలాపాల సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో మీడియా అడ్వైజరీ కమిటీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

