విదేశాల్లో ఉద్యోగాల పేరుతో టోకరా.. ముగ్గురు అరెస్ట్

రూ.లక్షలు వసూలు చేసి మోసం.. నకిలీ పత్రాలతో బురిడీ

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మావల మండలం కైలాస్‌నగర్‌కు చెందిన చిట్టిపవార్‌ లావణ్య తన తమ్ముడు రాహుల్‌కు విదేశాల్లోని మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.7 లక్షలు డిమాండ్‌ చేశారని ఫిర్యాదు చేశారు. ముందుగా రూ.3 లక్షలు చెల్లించినా ఉద్యోగం ఇప్పించకుండా పలుమార్లు తిప్పుతూ మాయమాటలతో మోసం చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మావల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా నిందితులు నకిలీ ప్రామిస్‌ నోట్‌, చెక్కులు ఇచ్చి మోసం చేసినట్లు వెల్లడించారు.

ఈ కేసులో ఏ1 మహ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌ (28), ఏ2 గోరెమియా (62), ఏ4 బలే శ్రీనివాస్‌ (47)లను గురువారం అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఏ3 షేక్‌ యాస్మిన్‌ అలియాస్‌ యాస్మీన్‌ సుల్తానా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మావల సీఐ బీడీ ప్రేమ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. విదేశీ ఉద్యోగాలు, వీసాలు, ప్రయాణాల విషయంలో గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని డీఎస్పీ సూచించారు. ముందస్తుగా డబ్బులు చెల్లించే ముందు సంబంధిత సంస్థలు, ఏజెన్సీల విశ్వసనీయతను పరిశీలించాలని కోరారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు డిమాండ్‌ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.