Chandrababu | పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలి
Chandrababu | పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలి
పరిస్థితులు మారాయి..ఇప్పుడు సంతానం భారం కాదు..సంపద!
చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమంలో తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం..
రాష్ట్రంలో 49.20 లక్షల చిన్నారులకు చుక్కల లక్ష్యం
Chandrababu | అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం, అనంతరం వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు.
పిల్లల ఆరోగ్య పరిస్థితి, టీకాల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం, ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ఐదేళ్లలోపు సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులతో మాట్లాడిన చంద్రబాబు, పిల్లల పెంపకం తల్లి ఒక్కరి బాధ్యత కాదని, తండ్రులు కూడా సమాన బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కారణంగా మారుతున్న జీవన విధానంలో కుటుంబ సభ్యులందరూ పిల్లల పెంపకంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లలకు విలువలు నేర్పడంలో కీలక పాత్ర పోషించేవారని గుర్తు చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని, అది సమాజానికి ఎంతో బలమైన వ్యవస్థ అని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇప్పటి పరిస్థితుల్లో సంతానాన్ని భారం కాదు.. సంపదగా చూడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. జనాభా సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) అధికారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.





