Eluru DSP | జూద క్రీడలు వద్దు – సాంప్రదాయ వేడుకలే ముద్దు

  • ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పిలుపు..

Eluru DSP | ఏలూరు, ఆంద్ర‌ప్ర‌భ : “జూద క్రీడలు వద్దు – సాంప్రదాయ వేడుకలే ముద్దు” అని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏలూరు రూరల్ మండలం కొల్లేరు గ్రామం గుడివాడ లంకలో యువశక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

యువతులు, మహిళలు పోటీలకు విచ్చేసి ఎంతో సందేశాత్మక రంగవల్లులను రూపొందించారు. సంక్రాంతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే ముగ్గులతో పాటు, దేశం మీద ప్రేమను, కుటుంబాల ఆప్యాయతను, జవాన్లను చూడు ముచ్చటగా రంగవల్లులుగా తీర్చిదిద్దారు.

ఏలూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా సంధ్య న్యాయ నిర్ణేతగావ్యవహరించి, ఉత్తమమైన ముగ్గులు వేసిన వారినీ ఎంపిక చేశారు. ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ సందేశాత్మక రంగవల్లులు వేసిన వారిని అభినందించి విజేతలకు బహుమతులు అందజేశారు.

గ్రామంలో గత 30ఏళ్లుగా ఆర్.ఏం.పి వైద్యునిగా వైద్య సేవలు అందిస్తూ, యువశక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాంప్రదాయ వేడుకలు నిర్వహించిన డాక్టర్ అప్పలభక్తుల శివన్నారాయణ శర్మను డిఎస్పీ అభినందించారు. గ్రామ సర్పంచ్ ఘంటసాల నాగరాజు, ఇతర గ్రామ పెద్దలు గ్రామంలో ఇలాంటి సందడి వాతావరణం నెలకొల్పినందుకు అభినందించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడే పారిశుద్ధ్య కార్మికులను డిఎస్పి శ్రావణ్ కుమార్ చేతులమీదుగా సత్కరించారు. సంక్రాంతి వేడుకల్లో ప్రజలందరూ పాల్గొనాలని, కోడిపందాలు, పేకాట వంటి జూద క్రీడల వైపు వెళ్ళవద్దని, సాంప్రదాయ వేడుకలే భవిష్యత్తుకు మంచిదని డీఎస్పి శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అలాగే మహిళలు, యువత సోషల్ మీడియా మాయలో పడి మోసపోవద్దని, సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లల చేతికి సెల్ ఫోన్ లు ఇస్తే, వారి జీవితాలుఅంధకారంలోకి వెళ్తాయనేది తెలుసుకోవాలని డి.ఎస్.పి గ్రామీణ ప్రజలకు హితవు పలికారు.

Leave a Reply