Narayanpeta | పేదలకు న్యాయం అందాలి

Narayanpeta | పేదలకు న్యాయం అందాలి

Narayanpeta | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : పేదరికం కారణంగా ఎవరూ న్యాయానికి దూరం కావొద్దని, ప్రతి పేద వ్యక్తికి న్యాయం, గౌరవం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పూర్తి ప్రయోజనాలు అందేలా చూడటం సమాజపు బాధ్యత అని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే. లక్ష్మిపతి గౌడ్ అన్నారు. బాల్యవివాహాలను సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ (లీగల్ సర్వీసెస్ అథారిటీ) ఆధ్వర్యంలో ఇవాళ నారాయణపేటలోని బీసీ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు.

ఈసదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మిపతి గౌడ్ మాట్లాడుతూ… నల్సా స్కీమ్–2015 కింద పేద అండ్ బలహీన వర్గాల ప్రజలకు న్యాయ సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించామని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం పేదరికం న్యాయానికి అడ్డంకి కావద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. సంక్షేమ పథకాలపై అవగాహన లేకపోవడం, దరఖాస్తు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యల వల్ల చాలా మంది పేదలు ప్రభుత్వ సాయాన్ని పొందలేకపోతున్నారని, అలాంటి వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాల లబ్ధి నేరుగా అర్హులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు 15100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని సూచించారు. అలాగే పోక్సో చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల రక్షణకు సంబంధించిన చట్టాలు, సామాజిక రక్షణ పథకాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు సమాజానికి మచ్చ అని, వాటిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణపై మాట్లాడుతూ… చెట్ల నాటకం, నీటి వనరుల శుభ్రత, ప్లాస్టిక్ నిషేధం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. సహజ వనరులను వృథా చేయకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని, పర్యావరణ చట్టాలపై అవగాహన ఉన్న సమాజమే ప్రకృతిని సమర్థవంతంగా రక్షించగలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పారా లీగల్ వాలంటీర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply