Revanth Reddy | జనవరి 26 డెడ్ లైన్ !!
Revanth Reddy | జనవరి 26 డెడ్ లైన్ !!
- జవాబుదారీతనం ఉండాలి..
- అభివృద్ధిపై ప్రతీ నెల అప్డేట్ ఇవ్వాలి..
- అద్దె భవనాలు ఖాళీ చేయాలి
- జనవరి 31 నాటికి భౌతిక ఫైళ్లకు స్వస్తి
- సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఆయన అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా అభివృద్ధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి కోణంలో మూడు విభాగాలుగా వర్గీకరించారు. రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్, విద్య, నీటిపారుదల వంటి రంగాల్లో స్పష్టమైన పాలసీలు లేకపోవడం వల్ల గతంలో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పుడు పక్కా విధివిధానాలతో ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.
NEW YEAR జోష్ లో హద్దుమీరితే ఉపేక్షించం..
క్షేత్రస్థాయి పరిశీలన అధికారుల బాధ్యత..
పరిపాలనలో జవాబుదారీతనం పెంచేందుకు అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని సీఎం సూచించారు. ఇకపై ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, నెలకు కనీసం మూడుసార్లు తమ శాఖా పరిధిలోని పనులను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి నెలా ప్రధాన కార్యదర్శికి (CS) పురోగతి నివేదికలు సమర్పించాలని, పనితీరుపై తాను స్వయంగా 3 నెలలకొకసారి సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది ఉద్యోగుల (రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్) పూర్తి వివరాలను జనవరి 26 లోగా నివేదించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు, ఈపీఎఫ్ సకాలంలో అందుతున్నాయో లేదో అధికారులు పర్యవేక్షించాలన్నారు.
అలాగే, అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని, ఖాళీగా ఉన్న హాస్టళ్లు, అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
డిజిటల్ పరిపాలన, ఈ-ఫైలింగ్
పరిపాలనను ఆధునీకరించే క్రమంలో భాగంగా జనవరి 31 లోగా అన్ని శాఖల్లో నూటికి నూరు శాతం ఈ-ఫైలింగ్ (e-filing) విధానాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. భౌతిక ఫైళ్లతో తిరిగే సంస్కృతికి స్వస్తి పలకాలని, ప్రతి శాఖ ఒక ప్రత్యేక డాష్ బోర్డును ఏర్పాటు చేసుకుని దానిని సీఎంఓ డాష్ బోర్డుతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు.
విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి..
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దాలని, రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్ వంటి అంశాలపై దృష్టి సారించి విద్యార్థుల నమోదును పెంచాలని సీఎం సూచించారు. వైద్య రంగంలో నిమ్స్ (NIMS) తరహాలో సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్‌లతో పాటు వరంగల్ హాస్పిటల్‌ను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్ది ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి : Apco Discout | ఆప్కో భారీ మేళా
