KTR | దమ్ముంటే… సహకార ఎన్నికలు వెంట‌నే పెట్టాలి

KTR | దమ్ముంటే… సహకార ఎన్నికలు వెంట‌నే పెట్టాలి

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌


KTR | ఉమ్మడి న‌ల్ల‌గొండ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిలో నియమిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని, ద‌మ్ముంటే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజా సమస్యల నుండి ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేసేందుకే రేవంత్ రెడ్డి కేసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు చేస్తామని మీడియాకు లీకులు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫలానా కేసులో కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు చేస్తామని కెమెరాల ముందుకు వచ్చి స్పష్టంగా చెప్పాలని సవాల్ విసిరారు.

ఈ రోజు నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలో బీఆర్ఎస్ నుండి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప ఉపసర్పంచ్ ల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రోజు రైతు దినోత్సవ‌మ‌ని, ఈరోజు రేవంత్ రెడ్డి రైతుల హక్కులను కాల రాసేలా తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని ఆయన ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు ఉపయోగపడే పాలమూరు, దిండి పథకాల డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తిప్పి పంపించి ఆరు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేద‌ని విమర్శించారు.

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు (Illegal cases) పెట్టినా తాము భయపడేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు నూరు రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి హామీలు అమలు అయ్యేలా పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 22 లక్షల మంది కౌలు రైతులకు భరోసా ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీల నుండి తప్పించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ కేసుల చుట్టూ రాజకీయం చేస్తుందని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ (Telangana) కు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే దమ్ము ధైర్యం రేవంత్ కు, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి లేదని అన్నారు. కేసీఆర్‌ చనిపోతాడని ఎన్ని తిట్లు తిట్టినా సహించాడని, కానీ తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతుంటే మాత్రం సహించమ‌ని అన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క రేపటినుండి మరోలా ఉంటుందని కాంగ్రెస్ నాయకులను ఆయన హెచ్చరించారు.

హత్య రాజకీయాలతో, పోలీసు, అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ చాలాచోట్ల అన్యాయంగా సర్పంచ్ స్థానాలను గెలిచిందని కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) దౌర్జన్యాలకు ఎదురొడ్డి బీఆర్ఎస్ పార్టీ (BRS party) తరఫున సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నికైన వారిని కేటీఆర్ అభినందించారు. అభ్యర్థులు కుంగి పోవాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని విర్రవీగే కాంగ్రెస్ నాయకులకు బీ ఆర్ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో 250 గ్రామపంచాయతీలను పార్టీ గెలుచుకోవడం పట్ల ఆయన జిల్లా నాయకత్వాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రామావత్ రవీంద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగ యాదవ్, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply