Kashmir Happy Pheran : హిమకేళి Andhra Prabha SPL Story

Kashmir Happy Pheran : హిమకేళి Andhra Prabha SPL Story
కశ్మీరీల్లో ఫెరాన్ జాతర
ఊరూవాడా ఇక గప్ చిప్
40 రోజులు కఠిన చలి
సర్కారు అప్రమత్తం
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)
అందచందాల కశ్మీరు లోయలో.. హిమపాతం (Snow fall) ఆరంభమైంది. జనం వేటకు చలి పులి రెడీ అంటోంది. వేటకు చిక్కకుండా ..ఇక జనం ఇళ్లల్లోనే గజగజలాడుతూ.. నెగడిల మంటల్లో చలి కాగటం ప్రారంభించారు.

కశ్మీర్ లోయలో ఈ 40 రోజులూ.. అత్యంత కఠిన చలికాలం ‘చిల్లై కలాన్’ (Chillai Kalan) 2025, డిసెంబర్ 21 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. 2026 జనవరి 31, వరకు కొనసాగుతుంది. జనవరి 31న చిల్లై కలాన్ ముగిసిన తర్వాత, 20 రోజుల ‘చిల్లై ఖుర్ద్’ (Chillai Khurd) 10 రోజుల ‘చిల్లై బచ్చా’ (Chillai Bachha) అనే తక్కువ తీవ్రత గల చలి కాలాలు ఉంటాయి.
ఈ 40 రోజుల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే కనిష్టానికి పడిపోతాయి. ఫలితంగా దాల్ సరస్సు వంటి నీటి వనరులు ,నీటి పైపులు గడ్డకట్టే అవకాశం ఉంటుంది.
శుభ శకునం : Kashmir Happy Pheran

చిల్లై కలాన్ తొలిరోజే గుల్మార్గ్, సోనామార్గ్ తదిత ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. శ్రీనగర్ మైదాన ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇది గత రెండు నెలలుగా ఉన్న పొడి వాతావరణానికి తెర దించింది. రానున్న 48 గంటల్లో లోయ అంతటా భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఈ 40 రోజుల్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే కనిష్టానికి పడిపోతాయి. శ్రీనగర్‌లో ఆదివారం కనీస ఉష్ణోగ్రత 4°C గా నమోదైంది. ఆకాశం మేఘావృతమైంది. గత కొద్ది రోజులతో పోలిస్తే ఇది సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువ, ఫలితంగా ఈ శీతాకాలంలోనే ఇది అత్యంత వెచ్చని రాత్రిగా శనివారం నమోదైంది.
గుల్మార్గ్‌లో అత్యల్పంగా -1.5°C, పహల్గామ్‌లో 2.5°C ఉష్ణోగ్రతలు రికార్డు కాగ, సోనామార్గ్, గుల్మార్గ్‌లలో ఆదివారం ఈ సీజన్ తొలి హిమపాతం (First Snowfall) కురిసింది. మైదాన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. చిల్లై కలాన్ మొదటి రోజు మంచు కురవడాన్ని స్థానికులు మంచి శకునంగా భావిస్తారు.
ఫెరాన్ సంబరం : Kashmir Happy Pheran

చిల్లై కలాన్ తొలి రోజును కశ్మీరీ ప్రజలు ‘ప్రపంచ ఫెరాన్ దినోత్సవం’ (World Pheran Day) గా జరుపుతారు. చలి నుండి రక్షణ కోసం సంప్రదాయ ఉన్ని వస్త్రమే (ఫెరాన్) ధరిస్తారు. సుదీర్ఘ కాలం సాగిన పొడి వాతావరణం (Dry Spell) తర్వాత నేడు కురిసిన మంచు వర్షం పట్ల కశ్మీరీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలలుగా వర్షాలు లేక గాలిలో పెరిగిన కాలుష్యంతో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు.

నేటి వర్షం గాలిని శుభ్రం చేయడంతో వారు ఉపశమనం పొందుతున్నారు. కశ్మీర్‌లో అత్యంత శీతల కాలమైన ‘చిల్లై కలాన్’ (Chillai Kalan) ప్రారంభం సందర్భంగా ప్రతి ఏటా డిసెంబర్ 21న అంతర్జాతీయ ఫెరాన్ దినోత్సవాన్ని (Kashmir Happy Pheran) అక్కడి ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. శని, ఆదివారాల్లోనూ ఫెరాన్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
లాల్ చౌక్ సందడే సందడి : Kashmir Happy Pheran

శ్రీనగర్‌లోని ‘కశ్మీర్ హాత్’ (Kashmir Haat) వేదికగా హ్యాండీక్రాఫ్ట్స్ , హ్యాండ్లూమ్ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు (డిసెంబర్ 20, 21) ఈ ఉత్సవాలు జరిగాయి. కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గర్గ్ ఈ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ డైరెక్టర్ ముస్రత్ జియా, సీనియర్ అధికారులు భారీ సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.

లోయ నలుమూలల నుండి వచ్చిన కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా సంప్రదాయ జరీ (Tilla) ఆరీ (Aari) ఎంబ్రాయిడరీతో కూడిన ఫెరాన్‌లు, పష్మీనా షాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ వద్ద స్థానికులు, పర్యాటకులు రంగురంగుల ఫెరాన్‌లు ధరించి సందడి చేశారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi Cutout) కటౌట్‌కు కూడా ఫెరాన్ ధరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు: ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలు, జానపద ప్రదర్శనలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.
ప్రభుత్వం అప్రమత్తం : Kashmir Happy Pheran
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శీతాకాల సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంచు వల్ల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రేషన్, ఎల్‌పీజీ (LPG) ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలను సిద్ధం చేశారు.

ప్రధాన రహదారులపై మంచును తొలగించడానికి యంత్రాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మంచు కురిసినప్పుడు విద్యుత్తు , నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, 24×7 అంబులెన్సులను, హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భారీ హిమపాతం కారణంగా జోజిలా పాస్, సధ్నా టాప్ వంటి ఎత్తైన కనుమ దారుల్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ALSO READ : Target Oscar Top 5 | రేస్ లో హోంబౌండ్
