
ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
–అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
Sunday Magazine సంచికలో…
1.అవినీతి.. ఆపలేమా?
2.చెప్పుకోండి చూద్దాం.. (ప్రశ్నలు)
3.మనసు-మాట శీర్షిక
4.బస్సే ఇల్లైన వేళ ! – కథ
5.కబుర్లు – శీర్షిక
6.సన్నిహితం… శీర్షిక
7.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
8.వెలుగు కిరణాలు – బాలప్రభ కథ
9.వినరో భాగ్యము – శీర్షిక
10.చెప్పుకోండి చూద్దాం (సమాధానాలు)
Sunday Magazine 07 DEC 2025
1.అవినీతి.. ఆపలేమా?
ఈ అంతర్జాతీయ దినోత్సవాల పేర్లను వింటుంటే ఒక్కోసారి విచిత్రంగా అనిపిస్తూంటుంది. ఇంకా నయం “అంతర్జాతీయ అవినీతి దినోత్సవం” అనలేదు.
ప్రతి సంవత్సరం డిసెంబరు 9న జరుపుకుంటారు ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవం. 2003 నుండి ఇది వస్తూ ఉంది. ఘనత వహించిన ఐక్యరాజ్య సమితి వారు ఒక అవినీతి వ్యతిరేక సదస్సును నిర్వహించి ఇలా జరుపుకోవాలని నిర్ణయించారు. భాగవతంలో నారాయణుడు సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు తన తండ్రికి ఒక పద్యం ద్వారా చెబుతాడు. దానికి పేరడీ రాస్తే ఇలా ఉంటుంది.
కం. ఇందుగలదందు లేదని
సందేహము వలదు యవని అవినీతి కడున్
ఎందెందు వెతికి చూచిన
అందందే గలదు మనకు అడుగడుగునా
ఇందిరా గాంధీ గారు ఒకసారి సెలవిచ్చారు.. “అవినీతి అనేది ఒక అంతర్జాతీయ దృగ్ విషయం” అని. కాబట్టి మన దేశంలోనే ఎక్కువ అని ఎవరు బాధ పడనక్కరలేదు. అవినీతికి పట్టుకొమ్మ అధికారమని ఏక్టన్ అన్న బ్రిటిష్ చరిత్రకారుడు చెప్పాడు. అది అక్షరాలా నిజం అన్నాడు ఒక మహానుభావుడు. “అధికారం అవినీతికి దారితీస్తుంది” “సంపూర్ణ అధికారం సంపూర్ణ అవినీతికి ఊతం” అని దాని అర్థం.
అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఉధృతంగా నడిపిన అన్న హజారే లాంటి వారు సోదిలోకి లేకుండా పోయారు. మచ్చ లేని వారుగా రాజకీయాల్లోకి వచ్చి అధికారం రాగానే అవినీతి పరుడుగా మారిన కేజ్రీవాల్ లాంటివారు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. ముందు అధికారంలో ఉన్న వారు లక్షల కోట్లు దోచుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ రచ్చ రచ్చ చేస్తాయి.
ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు కోట్లు తినేశాడని ఆయనను అరెస్టు చేసి జైల్లో పెడతారు కొన్ని రోజుల తర్వాత ఆయన నిక్షేపంగా బయటికి వస్తాడు కోర్టులు కూడా ఆయన అవినీతికి రుజువులు ఉన్నాయని ఒప్పుకుంటాయి. ప్రతిపక్షాలు “వచ్చేది మేమే.. వచ్చిన తర్వాత చూపిస్తాను మీ పని” అని హూంకరిస్తుంటాయి. ఎన్నికల తర్వాత జైలుకెళ్లిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. సీన్ రివర్స్..! దద్దమ్మలు ప్రజలే..!!
2025 లో ఐ రా స రూపొందించిన థీమ్ “అవినీతికి వ్యతిరేకంగా యువతను ఐక్యం చేయడం రేపటి సమగ్రతను రూపొందించడం” ఆట థీం లు లు బాగానే ఉంటాయి వినడానికి. నినాదం కూడా ఉందండోయ్ “గొలుసును బద్దలు కొట్టండి, మరకను అంతం చేయండి” వ్యవస్థీకృత నేరాల లక్షణాలలో అవినీతి కూడా విలసిల్లుతుంది.
‘తినగ తినగవేము తీయనుండు’ అని వేమన అన్నట్లు అవినీతి భాగోతాలను విని విని మనకు పెద్దగా ఆశ్చర్యం, బాధ అనిపించదు. మన చర్మం దళసరి కదా! సర్పంచ్ పదవికే కోట్లు ఖర్చు పెడుతున్నారంటే రాజకీయాలంత లాభసాటి వృత్తి మరొకటి లేనట్లే కదా..!
అనిశా (అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది) వారు అవినీతిపరులపై దాడులు చేసి ఎర్రచేతులతో (రెడ్ హ్యాండెడ్)గా పట్టుకుంటారు. వదిలేయడానికి వారు కూడా డబ్బు తీసుకుంటారని వదంతులు. కంచే చేను మేయడం అంటే ఇదే మరి.
నాణేనికి మరోవైపు కూడా ఉందండోయ్..! ఎగబడి తమ పనులు కావడానికి లంచాలు ఇచ్చేది మనమే. కాబట్టి లంచం ఇచ్చిన వాడికీ ఇవ్వ చూపిన వాడికి కఠిన శిక్షలు ఉండాలి. పై సంపాదన ఉన్నవారిని గౌరవించే సమాజం మనది. “ఇంట్లో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఒక సంబంధం వచ్చింది, కుర్రవాడు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్లానింగ్ విభాగంలో కీలక పదవిలో ఉన్నాడు.
పై సంపాదన బాగానే ఉంటుంది మరి ఏం ఆలోచించకండి కట్నం పది లక్షల ఎక్కువైనా సరే ఆ సంబంధమే ఖాయం చేయండి బంగారు బాతులాంటి ఉద్యోగం పిల్ల సుఖపడుతుంది” ఇలా మన బంధుమిత్రులే మనకు కౌన్సిలింగ్ చేస్తారు.
ఒక్కటి మాత్రం నిజం అవినీతిపరులు మనశ్శాంతిగా ఉండలేరు. నిరంతరం టెన్షన్.
మన లాంటి వాళ్ళ పనే హాయి. మనది నిజాయితీనా? భయమా? ఏమోమరి.
పాణ్యం దత్త శర్మ
2.చెప్పుకోండి చూద్దాం.. ప్రశ్నలు
ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం…

3.మనసు-మాట శీర్షిక

సంధ్య మనసు మాట…
నా పేరు సంధ్య. నా వయసు 42 సంవత్సరాలు. పాప పుట్టిన తరువాత నా భర్తకీ నాకు మనస్పర్థలు రావడంతో మేము విడాకులు తీసుకున్నాము. విడాకులు అయినప్పటి నుంచీ నేను నా తల్లితండ్రులతోనే నివసిస్తున్నాను. నేను ఉద్యోగం చేసుకోవడం వలన మా పాపను నా తల్లితండ్రులు పెంచారు.
తండ్రిని తను కలవలేదు ఎందుకంటే ఆయన విడాకులు తర్వాత విదేశాలకి వెళ్లిపోయారు. 5 సంవత్సరాల క్రితం నాతో పాటు పని చేసే సహోద్యోగితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆయనకి పెళ్ళై పిల్లలు వున్నారు. తను వివాహ బంధంలో సంతోషంగా లేరు విడాకులు త్వరలోనే తీసుకొని నన్ను పెళ్ళి చేసుకుంటారని మాట ఇవ్వటంతో మేము ఇద్దరము మానసికంగా, శారీరకంగా దగ్గరయ్యాము.
మా కుటుంబ సభ్యులకు కూడా ఆయనను పరిచయం చేశాను. మా పాప కూడా ఆయనతో అన్ని విషయాలు పంచుకొనేది, మేము కలిసి బయటకు వెళ్ళేవాళ్ళము. ఐతే 5 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా ఇప్పటికి విడాకులు తీసుకోలేదు, అడిగిన ప్రతిసారి ఎదో ఒక కారణం చెప్పడం- తన భార్య ఒప్పుకోవట్లేదనో, పిల్లలు బాధపడ్తున్నారనో, వత్తిడి తట్టుకోలేక చనిపోవాలని వుందని చెప్పటంతో నేనే సర్దుకుపోతున్నాను.
మా పాప కూడా దీని వలన ప్రభావితమవుతుంది. స్కూల్లో ఫ్రెండ్స్ మరియు ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు అంటున్న మాటలవలన బాధపడ్తుంది. ఆయన్ని వదిలేయి, నిన్ను మోసం చేస్తున్నాడు, నీకు అర్థమవ్వట్లేదు అని వాదిస్తోంది. నువ్వు నిర్ణయం తీసుకోకపోతే నేను కూడ చనిపోతా అని చెప్తుంది.
నువ్వు ఎప్పుడు నీ గురించే ఆలోచించుకుంటావు చాలా సెల్ఫిష్ అని అంటుంది. నీ జాబ్, అయన మాత్రమే నీకు ముఖ్యము నేను కాదు అనంటుంది. వీటిలన్నిటితో పాటు చనిపోతాననడం నాకు చాలా దిగులు కలిగిస్తుంది. పాప వయసు 16 సంవత్సరాలు మాత్రమే.
సైకాలజిస్ట్ మాట : సంధ్య, మీ మనసులోని మాటలు విన్నాను. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా క్లిష్టమైనవి. అందరి భావనలు గురించి అలోచించి మీ భావాలకు ఇవ్వాల్సిన ప్రముఖ్యతను విస్మరిస్తున్నారు. మీ పాప మీ గురించి ఆందోళన చెందుతోంది, మీరు ఆమెకు ముఖ్యమైనవారని ఎలా చెప్పాలో తెలియక భావొద్వేగానికి గురవుతుంది.
మీరు కూడా మీ పాప గురించి ఆందోళన చెందుతున్నారు, అతని గురించి ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ ఈ స్థితికి కారణం మీరే అన్న భావనలోకి వెళ్లిపోతున్నారు. గిల్ట్ ఫీల్ అవుతున్నారు. గిల్ట్ ఫీల్ అవుతేనే మార్పు వస్తుంది కానీ అది పరిమితి దాటినప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోలేము. దీని వలన మిమ్మల్ని ప్రేమించి చేయూతనిస్తున్న తల్లితండ్రులకు మరియు పాపకు మానసికంగా దూరమవుతున్నారు.
మీరు ఈ పరిస్థితిని మార్చాలంటే గిల్ట్ వదలండి. మీ గురించి, మీ పాప మరియు తల్లి తండ్రులు గురించి ఆలోచించండి. మీరు ఈ సంబంధాన్ని కొనసాగించాలా లేదా అతన్ని వదిలివేయాలా అని నిర్ణయించుకోవాలి.
కొన్ని చిట్కాలు :
- అయనకు చెప్పి కొంత సమయం గ్యాప్ కావాలని చెప్పండి. విడాకులు తీసుకున్న వరకు ఈ గ్యాప్ కొనసాగుతుంది అని ఖచ్చితంగా చెప్పండి.
- అవసరమైతే ఈ సమయంలో వేరే కంపెనీకి మారడానికి చూడండి. రోజు ఆయనను ఆఫీస్ లో చూసినప్పుడు మాట్లాడకుండా ఉండడం కష్టమవుతుంది.
- ఇక మీదట సంధ్య ఆయన మాటలను నమ్మకండి, ఆయన చర్యలను చూడండి. బంధంలో మీకు సమస్య వుంది అని చెప్పినప్పుడు చనిపోతా అంటే రేపు పెళ్ళయాక ఎన్నో వత్తిళ్ళు వస్తాయి అప్పుడు పరిస్థితి ఏంటి? మానసిక నిపునలకు చూపించుకోమనండి అంతే గాని మీరు సర్థుకుపోవడం సరైన పరిష్కారం కాదు. ఇది అలవాటు చేస్తే ఎప్పుడు మీరే సర్థుకుపోవాలి, గుర్తుంచుకోండి!
- ఇంటినుంచి, పాప నుంచీ ఆయనను దూరంగా ఉంచండి. ఇంటికి వచ్చాక ఫోన్ దూరంగా పెట్టి పాపతో మరియు తల్లితండ్రులతో మొత్తం సమయం గడపండి. వాళ్లతో కలిసి బయటకు వెళ్ళండి, విహార యాత్రలు చెయ్యండి.
- మీ ఆలోచన విధానాలు కలిసే స్నేహితులను చేసుకొండి. కొన్ని రోజులు మగ స్నేహాలకు దూరంగా వుండండి. ఆడ స్నేహాలు పెంచుకోండి. మీ ఆలోచన శైలికి సరిపోయే ఒకరు దొరికిన మీకు వంటరితనముండడు. అప్పటి వరకు పాపే మీ లోకం చేసుకోండి. మీ ఇద్దరి మధ్యన వచ్చిన మానసిక దూరం తగ్గించుకోండి.
- మీ పాప మీకు ముఖ్యమని చెప్పండి అలాగే తనకు అర్థమయ్యేలా మీ చర్యల్లో చూపించండి. మీరిద్దరూ ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్లడం మంచిది.
సంధ్య అయనలో వున్న గందరగోళ్ళాని మీ జీవితంలోకి ఆహ్వానించవద్దు. తక్షణమే మీకు ఎం కావాలో స్పష్టంగా చెప్పి పైన సూచించినవి అమలు పరచండి.
ది మైండ్ వాయిస్ :
సంధ్య పెళ్ళైన మగవాళ్ళు మిమల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు డివోర్స్ అయ్యాక కలవమని చెప్పండి అప్పుడు ఆయన గురించి ఆలోచించండి. ప్రేమించాను అన్నది ఉత్తి మాట, పెళ్ళి చేసుకోవడం అనేది నిజమైన ప్రేమ నుంచి వచ్చే బాధ్యత, పెళ్లితర్వాత ఎటువంటి కష్టాలు వచ్చిన కల్సి ఎదురుకొందాం అనేది నిబద్దత. ఇవన్నీ వున్నపుడే నమ్మకం నిలుస్తుంది, బంధం బలపడుతుంది.
4.బస్సే ఇల్లైన వేళ ! – కథ

ఒంగోలు – హైదరాబాద్ డీలక్స్ బస్సు ఎక్కాడు నరసింహం ఒంగోలు బస్ స్టాండ్లో. రాత్రి 9. 30 అయింది. బస్సు ఫుల్ అయింది .. తన సీటు బస్సుకి మధ్యలో కిటికీ వైపుకు వచ్చింది. పౌర్ణమి వెళ్లిన చవితి వాళ్ళ నాన్న తిధి. తను ఒక్కడే అవటం వలన తద్దినం పెట్టి పొమ్మని ఒంగోలు వాళ్ళ విన్నపం మన్నించి హైదరాబాద్ నుంచి నిన్న వచ్చాడు.
ముందు రోజు రాత్రి అతి వాసం ..ఇవాళ ఉపవాసం .. పితృశేషంతో ఏమీ కలవకూడదు కదా. మధ్యాహ్నం రెండైంది తద్దినం అయ్యేప్పటికీ. ఆవురావురు అంటూ తద్దినం భోజనం, తండ్రి ప్రసాదం తిన్నాడు. కంటి మీదికి కునుకు వస్తుండగానే ఒక్కొక్కరు ‘వెళ్లొస్తాంరా నరసింహం! ఈ వంకతోనైనా సంవత్సరానికి ఒక సారి మా ముఖం చూస్తున్నావు! అంటూ దీర్గాలు తీస్తూ వెళ్లిపోయారు.
అందరూ ఒక్కసారి కట్ట కట్టుకు పోయినా బాగుండును. ఒక్కోసారి ఒక్కోడు లేదా ఒక్కో ఆవిడ లేవటంతో కంటి మీద కునుకు తీయకుండానే సాయంత్రం అయిపోయింది. అంతా వెళ్ళేప్పటికీ తను బస్సుకు పోయే వేళ రానే వచ్చింది. సరే ఇక బస్ లో పడితే ‘రేపు ఉదయం దాకా మనల్ని కదిలించే వాళ్లుండరు. కాబట్టి హాయిగా నిద్ర పోవచ్చులే’ అని మనస్సులో అనుకొని రిక్షా మాట్లాడుకొని సమయానికి బస్ స్టాండ్ చేరాడు.
ఇది నరసింహం బస్ ఎక్కడానికి పూర్వ నేపధ్యం.. బస్ టైంకే స్టార్ట్ అయింది.. మంచి జోరు మీద లాగుతున్నాడు డ్రైవర్. అసలే హైవే ఇప్పుడు. పెద్దగా ఎదురు ట్రాఫిక్ లేనట్లుంది. బస్సు వేగానికి వెంటనే నిద్రపట్టింది నరసింహానికి. అలా బస్సు ఎక్కగానే నిద్రలోకి జారుకొనే వాళ్ళు కొందరు అదృష్టవంతులు ఎప్పడూ ఉంటారు. ఈ సారి నరసింహం ఛాన్స్. అంతే .
నరసింహం హఠాత్తుగా ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు గాఢ నిద్రలో నుంచి. ఏముందీ? బస్సులో మొబైల్ ఫోన్ల రింగ్ టోన్ లు.’హలో’ అంటూ స్పందిస్తూ మాట్లాడే వారి మాటలు. అవి మాటల్లా లేవు! గుసగుసలు లాంటివి అసలే కావు, మిన్నంటే అరుపులు. కొందరివి వ్యక్తిగత విషయాలు, కొందరివి అప్పులు, మరి కొందరివి సగంలో ఉన్న ఇంటి నిర్మాణాలు, ఇంకా మొగుడూ పెళ్ళాల మధ్య పోట్లాటలు, వగైరా, వగైరా!
‘ఈ మొబైల్ ఫోన్లు వచ్చాక మనుషులు వ్యక్తిగత జీవితమనే దానికి కొంత గోప్యం, రహస్యం, మర్యాద అనేవి ఉంటాయన్న సంస్కారమే మర్చి పోయారు. సమయం, సందర్భం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి, బస్సులో, రైల్లో, టోయిలెట్లో విమానంలో ఎక్కడ పడితే అక్కడ పక్కన వాడు ఏమనుకొంటాడో అనే జ్ఞ్యానం కూడా లేకుండా ఒకటే వాగుడు, అరుపులు, కేకలు. ఈ దరిద్రం మొబైల్ వచ్చి జీవితం మరింత అతలాకుతలం చేయటం మొదలు పెట్టింది. ఒకప్పుడు ఇంట్లో మనశ్శాంతి లేక పోయినా, రైల్లో, బస్సులోనైనా దొరికేది.
ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది’ అని మనస్సులో అనుకొన్నాడు నరసింహం. కొంచెం మెల్లగా మాట్లాడమని ఎవరికి చెప్పటం? దాదాపు బస్సులో సగం మంది అదే పనిలో ఉంటే? ఒక అయిదు నిముషాలు చూశాడు…ఇంతలో తన పక్క సీట్లో అతనకి కూడా ఫోన్ వచ్చింది.అతను కూడా ఫోన్ లో ‘హలో’ అంటూ మొదలు పెట్టాడు అరవటం. ఇక లాభం లేదనుకొని తను కూడా ఫోన్లో పెద్దగా అరవటం మొదలు పెట్టాడు. ఎంత పెద్దగా అరుస్తున్నాడంటే బస్సులో వాళ్ళకే కాదు, ఆ బస్సు వెళ్లే రూటులో వెళ్లే వాళ్లకి, ఎదురొచ్చే వాహనాల్లో వాళ్లకి కుడా విన్పించేలా!
చాలా మంది ఆ అరుపులకు ఉలిక్కి పడి నరసింహం వైపుకు తిరిగి నిష్చేష్టులై చూస్తుండి పోయారు ఆ బస్సులో. కొందరైతే ‘నువ్వు ఉండు, లైన్లో ఉండు, ఇక్కడ ఒకాయన ఫోన్లో మాట్లాడట్లేదు, ఏకంగా అరుస్తున్నాడు, కాస్తుండు లైన్లో’ అని తమ వాళ్లకు చెప్పి నరసింహం వైపు తిరిగి గుడ్లప్పగించి చూస్తున్నారు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయకుండా. ఇంతలో అటు వైపు నుంచి ఒకావిడ ‘ఎవరండీ? మీరే అనుకొంటే మీ తాతలా ఉన్నాడు! ఫోన్లో ఇవతల ఉన్న మాకే కర్ణభేరి పగిలి పోయేలా ఉన్నాయి ఆయన అరుపులు’ అని అంటున్నారు.
‘నువ్వుండవే, లైన్లో ఉండు! ఒకరిద్దరు ఆయన వైపు వెళ్తున్నారు ఆయనతో మాట్లాడడానికి . ఏమవుతుందో చూద్దాం? ఉండు లైన్లో’ అని ఒకాయనచెప్పసాగాడు. కానీ అవతలి వైపు నుంచి ‘చాల్లేండి, మీ అరుపులకే పిల్లలు నిద్ర లేచి ఏడుపు లంఘించుకొన్న సందర్భాలు కోకొల్లలు. మీకు బస్సులో నిద్ర పట్టక పొతే ఎదో ఒక విషయం లేవదీసి నన్ను పిల్లల్ని అర్ధరాత్రి హైరాన చేస్తారు.. ఈ జబ్బేఆ ఫోన్లో అరిచే ఆయనకు వచ్చినట్టుంది.
నేను ఫోన్ పెట్టేస్తాను. పిల్లలు ఏడుపు లంఘించుకొంటే చచ్చానే’ అంటూ లైన్ కట్ చేశారొకావిడ అవతలి వైపు నుంచి. ఇంకా కొంత మంది లైన్లో తమ వాళ్ళను అలానే ఉంచి నరసింహం వైపు చూస్తున్నారు ‘ఏమి జరుగుతోందా?’అని.
నరసింహం ఒకరిద్దరు తనవైపు రావటం గమనించి, ఫోన్ కట్ చేసి, కిటికీపై తల పెట్టి పడుకుంటున్నట్టు నటించాడు. ఆ వచ్చే ప్రయత్నం చేసిన ఒకరిద్దరూ నరసింహం ఫోన్ పెట్టేయటం, పడుకొనే ప్రయత్నం చేయటం గమనించి తమ సీట్లకు పోయి తిరిగి పెద్దగా ఫోన్లో మాట్లాడటం ప్రారంభించారు.
ఇంతలో నరసింహం ఫోన్ రింగైంది మళ్ళీ. ‘హలో’ అంటూ అరుపులు అందుకొన్నాడు నరసింహం. అవి అరుపుల్లా లేవు, మెరుపులు, పిడుగులు పడ్డట్లుగా ఉన్నాయి. ఇక మళ్ళీ నరసింహం దగ్గరకు వెళ్లి ఆయన్ను కొంచెం స్వరం తగ్గించమని అడిగే ధైర్యం ఎవ్వరూ చేయలేదు.
పైగా అది కండక్టర్ లేని బస్సు..డ్రైవర్ ఇవేమీ పట్టించుకొనే స్థితిలో లేడు. చేసేది లేక అందరూ ఫోన్లు కట్ చేసి తిన్నగా నిద్రోన్ముఖులు అయ్యే ప్రయత్నంలో పడ్డారు. అది గమనించి నరసింహం గూడా ఫోన్ కట్ చేసి నిద్రలోకి జారాడు. తెల్లారి అయిదు కల్లా బస్సు మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఆగింది…డ్రైవర్ ‘హైదరాబాద్, హైదరాబాద్’ అని అరిస్తే గాని నరసింహానికి, మిగిలిన వారికి స్పృహ రాలేదు. అందరూ గబగబా దిగి పోయారు .
నరసింహం కూడా బస్సు దిగి తన ఫోన్లోకి చూస్తే తనకు రాత్రి లెక్క లేనన్ని కాల్స్ చేసిన ఫ్రెండ్స్ ఒక్కసారిగా గుర్తొచ్చారు. వెంటనే అందరికీ పేరు పేరున థాంక్స్ గ్రూప్ మెసేజ్ పెట్టాడు.
‘వాళ్ళు తను పెట్టిన మెసేజ్ చూసుకొని, వరుస పెట్టి లెక్క లేనన్ని కాల్స్ చేయటం, తను వారితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ, బస్సులో మొబైల్ ఫోన్లో మాట్లాడే అందరి కంటే పెద్ద గొంతుతో అరుస్తూ ఫోన్లో మాట్లాడటం, ఆ దెబ్బకు బస్సులోని వారంతా సైలెంటై పోవటం, ఫలితంగా తనూ ఫోన్ కట్టేసి హాయిగా నిద్ర పోయానని, ఇక ఈ రోజు డ్యూటీ హాయిగా చేసుకో గలనని ‘ ఆ మెసేజ్ సారాంశం.
5.కబుర్లు – శీర్షిక

సీమటపాకాయలు
నాలుగు రచనలు చేసి నా అంత ఘనుడు లేడని గప్పాలు కొట్టే డబ్చారాయుళ్ళ కాలం చెల్లిపోయింది. గతంలో ఎవాడి గీకుడు వాడిదే! ఇప్పుడు అంతా అంతర్జాల మాయాజాలం. ముఖ పుస్తక ముఖద్వారం గుండా ఒక అనామక తెనాలి రామక్నష్ణుడు నాటు భాష రవ్వతో దివాళి సీమటపాకాయ తోకకు నిప్పంటిచినా వెంటనే టపటపా పేలుళ్ళు ఆగకుండా రచ్చరచ్చ చేసేస్తాయి. ఈమధ్య ముఖపుస్తకంలో ఓ వ్యంగ్య చిత్రకారుడు బొమ్మ వేసి ఇలా రాశాడు..
“మా రాజుగారికి బద్ధకంగా ఉందట… యుద్ధం రేపు పెట్టుకుందామని చెప్పిరమ్మన్నారు!!”
దీనికి స్పందనగా పెల్లుబికిన హాస్య వ్యాఖ్యలు చూడండి! నా మాటలు పేలని తూటాలు కావని తేలిపోతుంది.
బద్దకం అంటే కుదరదు… ఒక డే షెడ్యూల్ ఎంతో తెలుసా… భటులు, సైనికులు, పరివారం, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు వాటి ఫుడ్ జనాల ఫుడ్డు టెంట్ ఖర్చు నా ముందు సెటప్.. ఓ కోటి రూపాయల పైనే.. ముందు ఫోన్ పే ట్రాన్స్పర్ కొట్టమను..
ఈ నా కొడుకు మందుగాడిలా ఉన్నాడు. వావ్… రేపు శనివారం ..జీవహింస పాపం అని మా రాజు గారు యుద్ధం చెయ్యరు ..కనుక మీ భటులు మా భటులు కలిసి కార్డ్స్ ఆడుకుంటూ మందు కొడుతూ పార్టీ చేసుకుందాం . పదండి ..
అసలు యుద్ధాలు యుద్ధరంగంలోనే జరగాలనే నియమం పెట్టినోణ్ని చెప్పాలి. అక్కడిదాకా పోవాలంటే తలప్రాణం తోకలోకొస్తంది.
ఆన్లైన్ యుద్దాలు ఉంటే బాగుండేవి. శ్రమ తప్పేది
ఇవాళ రేపు ఎల్లుండి కూడా వద్దు, వరుసగా నాగులచవితి, నాగపంచమి కారిక పోనువారమూనుం
రేపు మా క్యాంపులో డాన్స్ ప్రోగ్రాముంది ఎల్లుండి కొట్టుకు చావండి అంటున్నారు మా రాజుగారు
కార్తీకంలో రాజు గారు రోజూ దీపాలు, నదీ స్నానాలు చేయాలట! అహింస పాటిస్తారట! మార్గశిరం లో పెట్టు కుందా మన్నారు
రోజుకో రాణి చితగ్గొడుతోందట! ఓ నెల రెస్ట్ కావాలట
ఆలస్యం అమృతం విషం ….. అనే సామెతను భలే వేశారు
ఈ రోజు చాలా చిరాకు ఉన్నాను రేపు వచ్చి చూసుకుంటా అన్ని అట్టున్నారు మా రాజావారు
అశ్వబలం ఎక్కడ.. కాల్బలం వెనుక ఉన్నారా??
అంతదాకా మాకు TA DA లు ఎవరిస్తారు ?
మలబద్ధకమా? మందు బహుమానం పంపమంటారా? కాళ్ళు పీక్కు పోతున్నాయిక్కడ !!!
అదేం దొబ్బదు మర్యాదగా వచ్చి యుద్ధం చేస్తాడా చెయ్యమను లేకపోతే మేమే దౌర్జన్యంగా దాడి చేసి మీలో ఎవరు కోటేశ్వరుడు లో నాగార్జున చెప్పినట్లు మీ రాజు గారి బద్ధకాన్ని చిటికెలో వదిలిస్తామని చెప్పు..! లేకపోతే నాటకాలాడుతున్నారు..! యుద్ధానికని వేసిన ఈ సెట్టింగుకి డబ్బులు ఎవడి స్తాడు మీ రాజు గారి తాత ఇస్తాడా..!
రాజుగారికి ఆ….. యుద్ధమప్పుడు కూడా బద్దకమైతే రాణి గారు నలుపు కోవటమే
రాజాధి రాజ మహా బద్దకిస్ట్.. సోమరి పోతు పురాధీశ్వరుడు
మేము ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా. ఎందుకులే రేపటి దాకా ఇక్కడే ఉంటాం. భోజనాలు పెట్టండి.
ఆదివారం ఆయన పేకాట కు వెళ్తారు, మీరు కూడ ఏదైన జూదం లకు వెళ్లాలని వినతి, రేపు కాదు వెళ్లుండి రెడీ మరి!
అదేం దొబ్బదు మర్యాదగా వచ్చి యుద్ధం చేస్తాడా చెయ్యమను లేకపోతే మేమే దౌర్జన్యంగా దాడి చేసి మీలో ఎవరు కోటేశ్వరుడు లో నాగార్జున చెప్పినట్లు మీ రాజు గారి బద్ధకాన్ని చిటికెలో వదిలిస్తామని చెప్పు..! లేకపోతే నాటకాలాడుతున్నారు..! యుద్ధానికని వేసిన ఈ సెట్టింగుకి డబ్బులు ఎవడి స్తాడు మీ రాజు గారి తాత ఇస్తాడా..!
రాజుగారికి ఆ….. యుద్ధమప్పుడు కూడా బద్దకమైతే రాణి గారు నలుపు కోవటమే
రాజాధి రాజ మహా బద్దకిస్ట్.. సోమరి పోతు పురాధీశ్వరుడు
మేము ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా? ఎందుకులే ! రేపటి దాకా ఇక్కడే ఉంటాం. భోజనాలు పెట్టండి.
ఆదివారం ఆయన పేకాట కు వెళ్తారు, మీరు కూడ ఏదైన జూదం లకు వెళ్లాలని వినతి, రేపు కాదు వెళ్లుండి రెడీ మరి!
పోనీలా ఈ విషయంమైనా చెప్పిరమ్మన్నారు బద్ధకం లేకుండా,ఇక తొందరగా వెనక్కివెళ్తాం
మీరు ఇలా యుద్ధం చేయకుండా బద్ధకిస్తే, ఎవరో ఒకరు వచ్చి యుద్ధాన్ని నేనే ఆపాను అంటారు.
ఈ రోజు బద్ధకం, రేపు ఏం మాయరోగం వస్తుందో, అసలు ఆయన యుద్దభూమి వచ్చాక మీరు వెళ్తే సరి
మొ న్న తలనొప్పి అన్నాడు . నిన్నేమో వీరేచనాలు అన్నాడు. ఇవాళ బద్ధకం అన్నాడు.అసలు యుద్ధం చేసే ఆలోచన ఉందో లేదో ముందు అది చెప్పమను..!!
చలికాలం కదా! ఆ మాత్రం బద్దకం ఉంటుంది
ఇంత చింత ఎందులకు రాజ్యం వారు చూసుకుంటారు ఇక విశ్రాంతి మీరు తీసుకుందురు
మరి ఈరోజు ఆదివారం కదా, ఈరోజు సెలవు, సోమవారం పెట్టుకుందాం అన్నారు మంత్రిగారు సైన్యధ్యక్షుడు
మా రాజుగారికి రేపు విజయోత్సవ సభ వుంది అంట యుద్ధం చేయకపోతే ఓడిపోయినట్లు ఒప్పుకో అంటున్నారు
రాజు వారి జ్యోతిష్కులు చెప్పారు ఒక వారం యుద్ధం వాయిదా నెయ్యాలాట. కబురు చేసాం అపుుడు గండి
రేపు వీళ్ళు బద్దకంతో ఉంటే ఎలా?
మా రాజుగారు కూడా తుఫాను వస్తోందని దుప్పట్లో దూరాడు లెండీ!!
మరి మీ రాజు యుద్ధ ఆహ్వాన పత్రికలో.. ఇవ్వాళే అన్నారు గదా…
మా రాజుగారికి రాత్రి మందెకువైంది మరి అందుకే రేపు రండి
అసలే కార్తీక మాసం అబ్బా జీవహింస మహాపాపం సుమీ
నడుస్తున్నది ఇదే కదా !
వెధవ బిల్డప్ లోపల తడి సిపోవుంటాది
***
6.సన్నిహితం… శీర్షిక

ప్రారంభించడం ముఖ్యం
నేను డిగ్రీ పూర్తి చేసాక ఉద్యోగాల వేట లో పడ్డాను. మూడేళ్లపాటు ప్రయత్నించినా తర్వాత ఒక జాబ్ వచ్చింది. అందులో సెటిల్ అయ్యాక వివాహం చేసుకున్నాను. వెనువెంటనే పిల్లాడు కూడా కలిగాడు మాకు. పూర్తిగా ఇటు సంసారం జీవితంలోనూ అటు వృత్తి జీవితంలోనూ మునిగిపోయాను.
అయితే వృత్తిలో ఎదుగుదల కోసం క్వాలిఫికేషన్ ఇంప్రూప్ప్ చేసుకుంటే మంచిది అని కొలీగ్స్ అందరిలో పీజీ చదవడం కోసం పార్ట్ టైమ్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. నాకు కూడా పీజీ చదవాలి అనే కోరిక కలిగింది. కానీ ఇటు సంసారం అటు ఉద్యోగం చేసుకుంటూ చదవడం కుదురుతుందా అని భయ పడ్డాను. కొంచెం వెనకడుగు వేసిన మాట వాస్తవం.
ఒక రోజు యూనివర్సిటీ కాలేజీకి వెళ్లి వాకబు చేశాను. నా లాంటి వాడి వల్ల ఈ పీజీ కోర్స్ చదవడం కుదురుతుందా అని వాళ్ళని అడిగాను . దానికి వాళ్లు మీరు బాగా కష్టపడి కొన్ని సుఖాలను ఆనందాలను వదులుకుంటే చదువు పూర్తి చెయ్యగలరు అని సలహా ఇచ్చారు. పైగా నేను పుస్తకం చదవడం మానేసి ఎన్నో సంవత్సరాలు అయింది. ఇవన్నీ ఆలోచించి కొంచెం సందేహంతో ఆగిపోయాను.
అయితే ఆ తర్వాత కొలీగ్స్ అందరూ జాయిన్ అవడంతో నేను కూడా జాయిన్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రతీ రోజూ ఆఫీసు అవగానే సాయంత్రం బైక్ మీద కాలేజీకి వెళ్లి వస్తూ ఉండేవాడిని . వారాంతంలో సబ్జెక్ట్స్ చదువుతూ పరీక్షలకు సిద్ధం అయ్యేవాడిని. నా భార్యా పిల్లాడిని కొంచెం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం.
కాలచక్రం గిర్రున తిరిగింది. రెండేళ్లు పూర్తి అయ్యాయి. పీజీ చదువు కంప్లీట్ అయింది. సంతోషంతో నా భార్య పిల్లాడికి థాంక్స్ చెప్పుకున్నాను.
అయితే ఇక్కడ నేను చెప్పాలి అనుకున్నది ఏమిటంటే.. మనలో చాలా మంది పని ప్రారంభించడానికి భయపడతాం. నా వల్ల అవుతుందా అని అనుమాన పడతాం. కానీ ఒక్కసారి ఆ పని ప్రారంభిస్తే ఆటోమేటిగ్గా అదే ముందుకు సాగుతుంది. మన కోరిక నెరవేరుతుంది. అందుకే మనకు ఇష్టమైన పనిని కష్టమైనా సరే వెంటనే మొదలుపెట్టండి ఫ్రెండ్స్ !!!!!
7.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాడిని నమ్మరాదు!
పురుషాధిక్య సమాజం మొదటి నుంచీ ఉంది మనకు. దాని భావజాలం ఆధారంగా యిలాంటి సామెతలు పుట్టి ఉంటాయి. లేకపోతే, నవ్వుకు ఏడుపుకు – పురుషుడు స్త్రీ, అని తేడా ఉంటుందా చెప్పండి? అవి అతి సహజంగా మానవుల్లో కలిగే స్పందనలు.
ఈ సామెతను ఏ ముప్పాళ రంగనాయకమ్మ గారికో, వోల్గా గారికో చెప్పామనుకోండి, ముఖం వాచేటట్లు చీవాట్లు పెడతారు. ఫెమినిజమా మజాకా? ఒకాయన దీన్ని యిట్లా వివరించాడు – “ఆడది ఏడుస్తూనే ఉండాలి. మగవాడు ఆమెను ఏడిపిస్తూ నవ్వుతూ ఉండాలి”.
వెంటనే తన కష్టానికైనా, ఇతరుల కష్టానికైనా స్పందించి కన్నీరుపెడతారు ఆడవారు. వారు సున్నిత మనస్కులు. దీన్ని వక్రీకరించి, ‘నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు’ అనడం అవివేకం అవుతుంది. మగవారైనా ఆడవారైనా, నవ్వితే ఎంతో బాగుంటారు. అమ్మవారి దుఃఖాన్ని కూడా ఎంతో రసరమ్యంగా వర్ణించారు పోతన్నగారు. “నా కావ్యాన్ని రాజులకు అమ్మనులే అమ్మా! ఏడవకు” అని చెబుతున్నాడు సరస్వతీ దేవికి.
ఉ.:
“కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల!”
ఆ దేవుడు కూడ మానవ జన్మ ఎత్తితే ఏడవాల్సిందే. శ్రీరాముడు, సీత కనబడకపోయేసరికి భోరున ఏడ్చాడు, తమ్ముడిని పట్టుకొని! వాల్మీకి రామాయణం, అరణ్య కాండ షష్టితమస్సర్గలో మహర్షి రామచంద్రుని దుఃఖాన్ని ఇలా వర్ణించాడు:
శ్లో:
“విప్రకీర్ణాజినకుశం విప్రవిద్ధబృసీకటమ్।
దృష్ట్వా శూన్యం నిజస్థానం విలలాప పునః పునః॥”
(అరణ్యకాండ, సర్గ 60, శ్లోకం 7)
‘విలలాప పునఃపునః’ అంటే కుమిలి కుమిలి ఏడ్చాడని. మరి ఆయన మగవాడు కాబట్టి, ఏడ్చాడు కాబట్టి నమ్మకూడదంటే ఎలా? హిరణ్యకశిపునంతటివాడు కొడుకు చనిపోయడేమోనని తలచి, కంటతడిపెడతాడు. “కంటనీరు ఒలుకుట అనునది నాకు ప్రథమానుభవము” అంటాడు.
పి.వి.నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో గాని నవ్వరు. అంతమాత్రాన వారు గొప్పవారు కాదనగలమా?
‘జ్యోతి’ అనే సినిమాలో ఆచార్య ఆత్రేయగారు ఒక అద్భుతమైన పాట వ్రాశారు.‘నవ్వు’ను ఉద్దీపనం చేసే పాట. అది యుగళగీతం. బాలుగారు, జానకి గారు దాన్ని పాడారు.
“సిరిమల్లె పువ్వల్లె నవ్వు! చిన్నారి పాపల్లె నువ్వు
చిరకాలముండాలి నీ నవ్వు, చిగురిస్తు ఉండాలి నా నువ్వు!”
ఈ పాటలో జానకమ్మ గారు నవ్వుతారు. ఎంత సహజంగా, హాయిగా ఉంటుందో ఆ నవ్వు! అలా నవ్వడం ఆమెకు తప్ప ఎవరికీ సాధ్యం కాదు. ఆమెనూ, ఆ పాత్ర వేసిన జయసుధనూ నమ్మకూడదంటే ఎలా?
‘కన్యాశుల్కం’ సినిమాలో మధురవాణి ఉత్తరం చదువుతూ ఉంటుంది. లుబ్ధావధాన్లు వింటూ ఉంటాడు. ఆడపెళ్లివారు ఏనుగుల తోను, లొట్టిపిట్టలతోను, తరలివస్తున్నారని అందులో చదివి, ఆ పాత్ర వేసిన మహానటి సావిత్రి విపరీతంగా నవ్వుతుంది. కారణం ‘లొట్టిపిట్ట’ అంటే ఒంటె! అంత నవ్వును నటించడం చాలా కష్టం. ఆ నవ్వు చూసి చిరాకు పడిన లుబ్ధావధాన్లు “ఏమిటా నువ్వు? మనిషివి కావా యేం?”అంటాడు. అలా నవ్వే సావిత్రి ఎంత అందంగా ఉంటుందో! ఇవన్నీ చూసి కూడా ఆడది నవ్వకూడదంటే ఎంత మూర్ఖత్వం? దుర్మార్గం కూడానండోయ్!
ఇలాంటి సామెతలలోని డొల్లతనాన్ని మనం గ్రహించాలి. ఆడైనా, మగైనా, నవ్వొస్తే నవ్వండి, ఏడుపొస్తే ఏడవండి! మన భావాలకు చక్కని let-out లు అవి! వాటిని అణుచుకుంటే మంచిది కాదు. తాను క్రింద జారిపడితే ద్రౌపది నవ్విందని కుళ్లి చచ్చాడు దుర్యోధనుడు. పాండవులు మంచిపేరు తెచ్చుకున్నారని ఏడ్చిచచ్చాడు. ఒక్కటి మాత్రం మనం చేయకూడదు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది చూసి నవ్వకూడదు. ఎవరయినా బాగుపడితే చూసి ఏడ్వకూడదు. ఇందులో ‘జెండర్ బయాస్’ అస్సలుండదండి!
మరో సామెతతో వచ్చే వారం కలుద్దాం!
8.బాలప్రభ కథ – వెలుగు కిరణాలు

మూడవ తరగతి చదువుతున్న విజయ్ చాలా తెలివైన వాడు, చురుకైనవాడు. కాకపోతే ‘తండ్రి తాగుడే’ అతని బాల్య జీవితంలో ఏకైక శత్రువు.
తండ్రి రాజన్న రోజు కూలీ. డబ్బు బాగా సంపాదిస్తాడు. కానీ, మద్యానికి బానిస. తాగి వచ్చి నిష్కారణంగా భార్యను తిట్టడం, కొట్టడం ఇంట్లో నిత్యకృత్యం.
భార్య సీతమ్మ వ్యవసాయ కూలీ. తన సంపాదనతోనే ఇల్లు నెట్టుకొచ్చేది. విజయ్ తో పాటు మరో ఆడపిల్ల కూడా ఉంది. బిడ్డల కోసం భర్తను భరించక తప్పడం లేదు. ‘ఆవు చేలో మేస్తే దూడ గెట్టున మేస్తుందా?’ అన్న చందాన పరిస్ఠితి ఉన్నది.
చిన్న వయసులోనే విజయ్ ని కోపం, తిట్లు ఆవరించాయి. వాటిని ఇంటా, బయటా తోటి పిల్లలపై ప్రయోగించేవాడు. నిష్కారణ గొడవలకు దిగేవాడు. బడిలోనూ అంతే. బాధితులైన పిల్లల ఫిర్యాదులతో, టీచర్లు, తల్లిదండ్రులతో రోజూ దేహశుద్ధి జరిగేది.
ఎంత మందితో ఎన్ని తన్నులు తిన్నా సిగ్గూశరం లేదు. క్రమేణా శిక్షలకు అలవాటై రాటు దేలాడు. చేసేది లేక ఊరంతా vijay ni ‘‘రౌడీ వెధవ’’ గా ముద్ర వేశారు. ‘దుష్టులకు దూరంగా ఉండమన్నారు కదా!’ పెద్దలు. అందుకే, వాడికి దూరంగా ఉండమని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పేవారు.
రెండేళ్ళు గడిచింది. ఇప్పుడు ఐదవ తరగతికి వచ్చాడు. బడి ప్రారంభంలోనే ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయ్యారు. బదులుగా శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు వచ్చాడు. ఎక్కడ పనిచేసినా అతనివి నాలుగే సూత్రాలు.
తాను చెప్పేది పిల్లలు వినేలా చేసుకోవడం.
వారిచే మాట్లాడింపజేయడం.
ఏ తెలుగు పుస్తకాన్ని ఎవరు ఇచ్చినా చూసి పిల్లలే చదవగలిగే టెక్నిక్స్ నేర్పడం.
మంచి దస్తూరితో వ్రాత నేర్పించడం.
ఈ క్రమంలో పిల్లలను తిట్టడు, కొట్టడు కూడా. పైగా కొత్త కొత్త విధానాలతో బోధన చేసేవాడు. పిల్లల్లో మంచి విలువలు నింప గల ఉత్తమ ఉపాధ్యాయుడు. నిత్యవిద్యార్థి. విద్యార్థులను మంచి బాట వైపు తీర్చి దిద్దగల నేర్పరి. ఆ సంవత్సరం శ్రీధర్ ని 4,5 తరగతులకు కేటాయించారు. మొదటి రోజు పిల్లలను పరిచయం చేసుకున్నాడు. గలగల శబ్దంలోనే సాగింది పరిచయం.
కథలు, కబుర్లు చెప్పాడు. పాటలు పాడాడు. పిల్లలకు కొత్తగా, ఆకర్షణీయంగా అనిపించింది. తరగతి గది కాస్త సద్దుమణిగింది. తన మాటలు/పాటలు ఆపగానే షరా మామూలైంది. సాయంత్రం కొత్త కొత్త ఆటలు కూడా ఆడిస్తూ, పిల్లల్లో మమేకం అవుతున్నాడు. మూడు రోజులు గడిచాయి. సారుపై అభిమానం మొలకలెత్తుతున్నది. తరగతిలో గోల కాస్త తగ్గుముఖం పట్టింది. కాస్త వినడానికి అలవాటు పడుతున్నారు. అడిగిన దానికి జవాబిస్తున్నారు. విజయ్ తో పాటు ఒక్కొక్కరి మనస్తత్వం కూడా తెలుస్తున్నది. చెస్, క్యారంబోర్డు, బ్రెయిన్విటా, జెంగా గేమ్ లాంటివి కొని తెస్తున్నాడు. వాటన్నిటినీ నేర్పిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నాడు.
రెండు వారాల తరువాత శ్రీధర్ ఓ నోటుబుక్ తెచ్చాడు. పిల్లలకు చూపిస్తూ, ‘‘చూడండి పిల్లలూ! ఈ నోట్బుక్ నా డైరీ అన్నమాట. మీరు చేసే మంచి పనులకూ, సమాధానాలకూ పాయింట్స్ ఇస్తాను. అవి ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, 5, 10 కూడా ఇవ్వవచ్చు. మీరు చేసే పనిని బట్టి, మీ సమాధానాలను బట్టీ. వాటిని మీ పేరుతో డైరీలో వ్రాసుకుంటా. 50 పూర్తి కాగానే ఒక గిఫ్ట్, చూద్దాం ఎవరో ఫస్ట్. తరువాత 100 కు, 150 కి, ఇలా ఇస్తూనే ఉంటాను.’’ అన్నాడు. పిల్లలలంతా,‘‘హై, భలే భలే!’’ అంటూ సంబర పడ్డారు, విజయ్ తప్ప.
రోజూ సారు పాయింట్స్ వ్రాస్తున్నపుడు పిల్లలను దగ్గరికి పిలిచేవాడు. డైరీలో వారి పేరు గుండ్రంగా, అందంగా వ్రాస్తుంటే ,‘అబ్భ’ అంటూ పిల్లల కళ్ళల్లో మెరుపు వచ్చేది. విజయ్ మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక్కొక్కరికీ పాయింట్స్ వస్తున్నాయి.
‘‘ఆఁ..రాజు కరెక్టుగా చెప్పాడు. కాబట్టి, ఒక పాయింట్, చప్పట్లు కొట్టండీ’’,
‘‘రాధిక, చక్కగా 5 ఎక్కాలు చెప్పింది. సో, ఫైవ్ పాయింట్స్, కమాన్, చప్పట్లు కొట్టండీ’’
ఇలా అంటుంటే పిల్లల్లో ఉత్సాహం పెరిగి పోయేది. ఒక నెల తిరిగే సరికి, పిల్లలందరిలో వారికి తెలియకుండానే మార్పు వచ్చింది. కాస్త విజయ్ లో కూడా. ఫిర్యాదుల ఊసే లేదు. ఓరోజు సారు వరుసగా 5మంది విద్యార్థులకు పాయింట్స్ రాస్తున్నాడు. పిల్లలంతా చేరి చప్పట్లు మ్రోగిస్తున్నారు. ఈ సంఘటన విజయ్ మనసులో ప్రకంపనలు రేపింది.
ఉన్నట్లుండి ఓ రోజు విజయ్ లేచి,‘‘సార్, మీరు పాడిన ఆ పద్యం నేను పాడమంటారా?’’ అన్నాడు.
‘‘ఊ..పాడు’’ అనగానే అద్భుతంగా రాగయుక్తంగా పాడాడు.
వెంటనే ఉత్సాహంతో సారు,‘‘ వెరీ గుడ్. ఫైవ్ పాయింట్స్’’ అన్నాడు. ఊహించని ఈ పరిణామంతో విజయ్ పెదవులపై తెలియకుండా చిరునవ్వు మొలిచింది. తరగతి పిల్లల అందరి వైపు చూస్తూ ముఖంలో వెలుగులు నింపుకున్నాడు. తరగతి వాతావరణం మారిపోయింది. చప్పట్ల వర్షం కురిసింది. vijay lO నిద్రాణమై ఉన్న ఉత్సాహ బీజం మొలకలేసింది. ఆ రోజుటి నుండి అన్ని కార్యక్రమాలపై vijay ki ఆసక్తి పెరిగింది. పిల్లలతో కలిసి పోయాడు. మూడు నెలల పరీక్షలో మంచి మార్కులు కూడా సాధించాడు. 50 పాయింట్స్కు గిఫ్ట్ తెచ్చుకున్న పది మందిలో విజయ్ కూడా ఒకడైనాడు.
ఇప్పుడు సారు విజయ్కి చిన్న చిన్న పనులు కూడా అప్పగిస్తున్నారు. ‘‘బోర్డు తుడిచేయ్ విజయ్ ’’, ‘‘ఈ పద్యం నువ్వైతే చాలా బాగా పాడతావు విజయ్’’ “ఇప్పుడు మన విజయ్ మీకు గేయానికి అభినయం చూపిస్తాడు” ఇలా మిగిలిన విద్యార్థులతో పాటు అతనిలో నమ్మకం నాటారు. తరువాత స్కూల్ నాటికలో కథకుడిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో కూడా తండ్రి వచ్చే లోపు నిద్ర పోతున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగింది.
-౦-
ఆరోజు పాఠశాల వార్షికోత్సవం. తల్లిదండ్రులందరూ హాజరయ్యారు. పనులు కూడా మానేసిన రాజన్న తాగిన మత్తులోనే కార్యక్రమానికి హాజరయ్యాడు. నాటికలో కథకుడుగా విజయ్ ది మద్యం బానిసలకు బుద్ధి చెప్పే పాత్ర. ‘పెద్దల తప్పుల వలన పిల్లల జీవితాలు ఎలా చీకటి పాలవుతున్నాయో?’చెప్పడం. పాత్రలో విజయ్ లీనమైపోయి అద్భుతంగా జీవించాడు. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాడు. మత్తులో ఉన్న రాజన్నను కొడుకు వేషం, కళ్ళు విప్పార్ఛేలా చేసింది. అతనికి తెలియకుండానే కొడుకు వేషం చూడడానికి శరీరాన్ని నిటారుగా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చాలావరకు సఫలమయ్యాడు.
స్జేజీపై కొడుకును చూసి ముగ్ధుడైనాడు. డైలాగ్స్ వినడానికి చెవులు రిక్కించాడు. విజయ్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. ప్రేక్షకుల చప్పట్లు రాజన్న మత్తును తునాతునకలు చేస్తున్నాయి. నాటిక ముగియగానే, చప్పట్లు, కేరింతలు, ఈలలతో ఆ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీధర్ సార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ కౌగిలించుకున్నాడు. సారు భుజం తట్టి ఓదర్చాడు. కార్యక్రమం ముగిసింది. రాజన్న మనసులో తప్పు చేశానన్న భావనకు బీజం పడింది. తరువాతి రోజు తాగి ఇంటికి వచ్చినా, గొడవ చేయలేదు.
ఆ బీజం మొలకలెత్తసాగింది. భార్యాబిడ్డలపై ప్రేమ, జాలి పెరగసాగాయి. ఈ మధ్య ఒక్కో రోజు అస్సలు తాగకుండా ఇంటికి వస్తున్నాడు. భార్య ఆశ్చర్యంతో నోరు తెరిచింది. కానీ, ఏమీ మాట్లాడకుండా తనలో తాను తెగ మురిసిపోయింది. కానీ, తన ఆశ్చర్యానికి సమాధానం దొరకలేదు. అనుకోకుండా ఒకరోజు రాజన్న ప్రమాదంలో గాయపడ్డాడు. హాస్పిటల్లో చేర్పించారు.
చికిత్స చేశాక బెడ్ పై పడుకోబెట్టారు. విజయ్, తండ్రి దగ్గరికి వెళ్ళి ,‘‘నాన్నా, నేను మారిపోయాను. నువ్వూ మారవచ్చు కదా!’’ అడిగాడు. ‘‘ మారి పోతానురా, కన్నా! మారిపోతా’’ నంటూ, భార్యా బిడ్డలను దగ్గరికి తీసుకున్నాడు. భోరుమని ఏడుస్తూ, కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంటికి చేరాక అతి తక్కువ కాలంలోనే మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ స్కూల్ లో ‘‘ఉత్తమ ప్రవర్తన గల విద్యార్థి’’గా గుర్తింపు పొందాడు. రాజన్నలో నూతన తేజం వచ్చింది. ఉపాధి పనుల్లో తిరిగి స్థిరపడ్డాడు. ఈ మార్పుకు మూలం ఒక్కటే. ఒక మంచి ఉపాధ్యాయుడు, ప్రేమతో చూపిన మార్గం.
ఓ మంచి ఉపాధ్యాయుడి ఆదర్శ బోధన ఒక విద్యార్థి జీవితానికి వెలుగు కిరణమైంది.
ఓ నాటికలోని పాత్ర మద్యం బానిసను తట్టిలేపిన ఇంకో వెలుగు కిరణం అయ్యింది.
ఓ వ్యక్తిలో వచ్చిన మార్పు అతని కుటుంబానికి మరో వెలుగు కిరణంగా మారింది.
ఇలా, కంటికి కనబడని ‘‘వెలుగు కిరణాలు’’ ఎన్నో?!
9.వినరో భాగ్యము – శీర్షిక

తిరుమల కల్యాణ కట్ట కు వందేళ్ల చరిత్ర
తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించే విషయంలో స్థల పురాణాల కథలు ఎన్నో ఉన్నాచంద్రగిరి సంస్థానాన్ని పాలించిన శ్రీనివాస మహాదేవ కాలంలో తలనీలాల సమర్పణకు సమగ్ర రూపం ఏర్పడినట్టు శాసనాధారాలు పేర్కొంటున్నాయి . తొలుత తిరుమల ఆలయానికి సమీపంలోని రాగిమాను కింద కొందరు క్షురకులు తలనీలాలను తొలగించేవారు.
పెరుగుతున్న భక్తుల సంఖ్య ను దృష్టిలో ఉంచుకుని బేడీ ఆంజనేయస్వామి గుడికి సమీపంలో 1916 లో ఏర్పాటైన కల్యాణకట్ట అనే వ్యవస్థ కు అనుబంధంగా 1922లో శివరామయ్య అనే వ్యక్తి నేతృత్వంలో కల్యాణ కట్ట సంఘం ఏర్పడింది ఆ సంఘంతో 1946లో తిరుమల తిరుపతి దేవస్థానాల (టి టి డి) కు మధ్య కుదిరిన ఒప్పంద పునరుద్దరణ 1975లో జరిగింది 1985 లో రాగిమాను సెంటర్ కు సమీపంలో ఉన్న కల్యాణకట్ట కాంప్లెక్స్ నిర్మితమైంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టి టి డి గత దశాబ్ద మధ్యకాలంలో తిరుమలలోనే వివిధ వసతి సముదాయాల వద్ద మినీ కల్యాణ కట్టలను ఏర్పాటు చేసింది భక్తులు సమర్పించిన తలనీలాల వేలం ద్వారా టి టి డి కి ఏటా రూ 300 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. అందుకు తగినట్టుగానే తిరుపతిలో అలిపిరి సమీపంలో తలనీలాల విక్రయ అవసరాలకు కోసం టి టి డి 2017 లో భారీ కాంప్లెక్స్ ను నిర్మించింది .
నమో వెంకటేశాయ.
10.చెప్పుకోండి చూద్దాం (సమాధానాలు)

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun Sun

