Srisailam | డిసెంబ‌ర్ 8 వ‌ర‌కు ఆ సేవ‌లు బంద్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల భారీ రద్దీ కారణంగా డిసెంబరు 8వ తేదీ వరకు శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపివేసిన‌ట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు.

జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షా భక్తులకు మాత్రం డిసెంబరు 5వ తేదీ వరకు విడతల వారీగా ప్రతి రెండు గంటలకు ఒకసారి స్పర్శదర్శనం అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 1 నుంచి కార్తీకమాస శివదీక్షా విరమణ కార్యక్రమం ప్రారంభమైందని, 5వ తేదీ వరకు కొనసాగుతుందని వారు చెప్పారు.

ఈ కారణంగానే జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షా భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం కొనసాగుతోందన్నారు. డిసెంబరు 6, 7, 8 తేదీలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, స్పర్శ దర్శనం ఆన్‌లైన్ టిక్కెట్ల జారీని కూడా నిలిపివేయడం జరిగిందన్నారు. ఈ మూడు రోజులు భక్తులందరికీ కేవలం అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని వెల్లడించారు.

డిసెంబరు 8 వరకు సిఫారసు లేఖల ద్వారా వచ్చిన వారికి కూడా స్పర్శ దర్శనం అవకాశం ఉండదని స్పష్టంచేశారు. సాధారణ భక్తులు సర్వదర్శనం క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

అలంకార దర్శనం ఏర్పాటుతో భక్తులందరూ సులభంగా శ్రీస్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుందని తెలిపారు. అయితే డిసెంబరు 5 వరకు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు యథావిధిగానే కొనసాగుతాయన్నారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ఈవో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply