UNANIMOUS : కొండపల్లి కో – ఆప్షన్ సభ్యులు

UNANIMOUS : కొండపల్లి కో – ఆప్షన్ సభ్యులు
- టీడీపీ నుంచి మహబూబ్ సుభాని
- – జనసేన నుంచి యర్రంశెట్టి నాని
- – బీజేపీ నుంచి షేక్ నగీనా
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) :

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ కో – ఆప్షన్ సభ్యులుగా ( షేక్ మహబూబ్ సుభాని, యర్రంశెట్టి నాని, షేక్ నగీనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అధ్యక్షతన మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో కో – ఆప్షన్ పదవులకు (Co Opted Members) నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లు, తిరస్కరణకు గురైన నామినేషన్లు, ఉపసంహరించుకున్న అభ్యర్థుల పేర్లు చదివి వినిపించారు.
ముస్లిం మైనార్టీ కేటగిరిలో షేక్ మహబూబ్ సుభాని (TDP), జనరల్ కేటగిరిలో యర్రంశెట్టి నాని (Jana Sena), మైనార్టీ మైనార్టీల కేటగిరిలో షేక్ నగీనా (BJP) మాత్రమే బరిలో నిలిచినట్లు చెప్పారు. దీంతో ఈ ముగ్గురు కో – ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా (Unanimous) ఎన్నికైనట్లు ప్రకటించారు.
2:20 గంటలు ఆలస్యం
కొండపల్లి మున్సిపల్ కో – ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం కోరం లేక దాదాపు 2:20 గంటలు ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మరో ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. 11:30 గంటల నుంచి 12:30 గంటల మధ్య కౌన్సిలర్ల హాజరు 9కు చేరింది. మొత్తం 29 మంది సభ్యులకుగాను కోరం ఏర్పాటుకు 15 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది.
మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:20 గంటల మధ్యలో కోరం ఏర్పాటయ్యే సభ్యులు హాజరవడంతో ఎట్టకేలకు సమావేశాన్ని ప్రారంభించారు. అంతకముందు కౌన్సిలర్ల రాక కోసం చైర్మన్ చిట్టిబాబు (Chaiman Chitti Babu), కో – ఆప్షన్ అభ్యర్థులు, కూటమి నేతలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వచ్చింది. కోరం ఏర్పడే వరకు సమావేశం ప్రారంభించే అవకాశం లేకపోవడంతో చైర్మన్ చిట్టిబాబు, కో – ఆప్షన్ అభ్యర్థులు పలుమార్లు కౌన్సిలర్ లకు ఫోన్లు చేసి సమావేశానికి హాజరుకావాలని కోరాల్సి వచ్చింది.
ఒకానొక దశలో ప్రతిపక్ష కౌన్సిలర్ లకు సైతం ఫోన్లు చేసి సమావేశానికి హాజరుకావాలని కోరారు. కో – ఆప్షన్ సభ్యుల ఎన్నిక సమావేశానికి అధికార పార్టీ కౌన్సిలర్లే ఆసక్తి చూపకపోవడంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కోరం ఏర్పడకపోవడంతో సమావేశం వాయిదా పడే అవకాశాలు కనిపించాయి. చివరికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ జోక్యం చేసుకోగా కౌన్సిలర్లలో కదలిక వచ్చింది. చివరి 20 నిమిషాల్లో మిగిలిన కౌన్సిలర్ లు వరుసగా హాజరై కోరం ఏర్పడటంతో ఉత్కంఠకు తెరపడింది.
ఎందుకింత అనాసక్తి
కో – ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశానికి ఎక్కువ మంది అధికార పార్టీ కౌన్సిలర్ లు అనాసక్తి చూపారు. కో – ఆప్షన్ అభ్యర్థుల నుంచి పిలుపు, కూటమి పార్టీల నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పురపాలక సంఘం కార్యాలయం నుంచి కౌన్సిలర్ లు సమావేశం సర్క్యులర్ లు అందుకున్నా కో – ఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావాల్సిన వారు తమ ఎన్నికకు హాజరై మద్దతు తెలపాలని ఒక్క మాటైనా చెప్పకపోవడంతో కౌన్సిలర్లు ఒకింత నొచ్చుకున్నట్లు తెలిసింది.
అందువల్ల ఎవరికి వారు సమావేశానికి రాకుండా మిన్నకుండిపోయారు. ఇది గ్రహించిన కో – ఆప్షన్ అభ్యర్థులు అప్పటికప్పుడు కౌన్సిలర్లకు ఫోన్లు చేసి సమావేశానికి రావాలని కోరారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వసంత జోక్యం చేసుకోవడంతో కౌన్సిలర్లు హుటాహుటిన సమావేశానికి చేరుకున్నారు.
వైసీపీ కౌన్సిలర్లు దూరం..
కో – ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశానికి 9 మంది వైసీపీ కౌన్సిలర్ లు (Ycp Absece) గైర్హాజరయ్యారు. కో – ఆప్షన్ కు వైసీపీ నుంచి ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఈ సమావేశంలో ప్రేక్షక పాత్ర పోషించాల్సి ఉంటుందని భావించిన వైసీపీ సభ్యులు ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని డుమ్మా కొట్టారు. చైర్మన్ చిట్టిబాబు, కో – ఆప్షన్ అభ్యర్థులు ఫోన్లు చేసినా వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడం విశేషం. వైసీపీ సభ్యులు హాజరై ఉంటే ముందుగానే కోరం ఏర్పడేది. వారు లేకపోవడంతో టీడీపీ సభ్యుల కోసం ఎదురెదురు చూడాల్సి వచ్చింది.
ఎమ్మెల్యే వసంత ప్రసాద్ అభినందనలు
కొండపల్లి పట్టణంలో సమస్యల పరిష్కారానికి పాలకవర్గంతో కలిసి నూతన కో – ఆప్షన్ సభ్యులు కృషి చేయాలని (Mylavaram MLA) మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) సూచించారు. నూతనంగా ఎన్నికైన కొండపల్లి మున్సిపల్ కో – ఆప్షన్ సభ్యులను పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ లో ఎమ్మెల్యే వసంత అభినందించారు. కొండపల్లి మున్సిపల్ కో – ఆప్షన్ సభ్యుల ఎన్నికలు చైర్మన్ చిట్టిబాబు అధ్యక్షతన మంగళవారం జరిగాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ మహబూబ్ సుభాని (టీడీపీ), యర్రంశెట్టి నాని (జనసేన), షేక్ నగీనా (బీజేపీ)లకు ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారిని దుశ్శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమిలో భాగంగా ఈ ముగ్గురికీ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు జంపాల సీతారామయ్య, బొమ్మసాని సుబ్బారావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామమోహన రావు (గాంధీ), బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు (బాల) తదితరులు పాల్గొన్నారు.
