Cases | స్క్రబ్ టైఫస్ విజృంభణ..

Cases | స్క్రబ్ టైఫస్ విజృంభణ..
- కర్నూలు జీజీహెచ్ లో 40కేసులు నమోదు
- ఆందోళనలో ప్రజానీకం
- వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం
ఆంధ్రప్రభ బ్యూరో, కర్నూలు :
Cases | కర్నూలు జిల్లా మళ్లీ ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ వ్యాప్తి నేపథ్యంలో, ఒక్క కర్నూలు జిల్లాలోనే అధిక సంఖ్యలో కేసులు (Cases) నమోదు కావటంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. కర్నూలు జీజీహెచ్‌లోనే 40 కేసులను వైద్యులు దృవీకరించారు. అంతే కర్నూలు నగరంలో కలవరం ప్రారంభమైంది. కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తమ సిబ్బంది అప్రమత్తం అయ్యారని, పరిస్థితిని అదుపులో తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వివరించారు.

‘చిగ్గరే ‘ ప్రధాన కారకం
స్క్రబ్ టైఫస్ నేరుగా మనిషి నుండి మనిషికి కాకుండా, అడవి ప్రాంతాలు, పొదలు, గడ్డి దట్టంగా ఉన్న ప్రదేశాల్లో ఉండే సూక్ష్మ కీటకం చిగ్గర్ కుట్టినప్పుడు వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు దాని లాలాజలంలో ఉండే ఒరియెంటియా సుట్సుగాముషి అనే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు (Infection) దారితీస్తుంది.వర్షాకాలం, అధిక తేమ, పచ్చదనం ఇవన్నీ ఈ కీటకాలకు పెరుగుదలకు ఆకర్షణ వేదికలు. గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, పంట పొదల చుట్టుపక్కల ఈ కీటకాలు ఎక్కువగా కనిపించడం వల్ల రైతులు, కూలీలు, అడవుల్లో పనిచేసే కార్మికులు ప్రమాదానికి గురవుతుంటారు.
ప్రమాద సంకేతాలు
ఎస్చార్ ..కుట్టిన ప్రదేశంలో మొదట ఎర్రగా కనిపించే చిన్న మచ్చ తరువాత నల్లగా మారుతుంది. ఇది గమనించదగ్గ ముఖ్య సంకేతం.దీనితో పాటు అధిక జ్వరం,తీవ్రమైన వణుకు, తలనొప్పి,కండరాల నొప్పులు, దద్దుర్లు,వికారం,గ్రంధుల వాపు లక్షణాలు తీవ్రరూపం (severe) దాల్చితే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి ముఖ్య అవయవాలపై ప్రభావం చూపుతుంది. చికిత్స ఆలస్యం చేసినట్లయితే న్యుమోనియా, మెనింజిటిస్, మయోకార్డైటిస్, రెనల్ ఫెయిల్యూర్‌లకు దారితీసే అవకాశం వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కర్నూలులో ఆందోళన
కర్నూలు జిల్లాలో స్క్రబ్ టైఫస్ (Scrub typhus) కేసులు గణనీయంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల వ్యవసాయ రంగం, గడ్డి ప్రాంతాలు, అడవుల అంచుల్లో తిరిగే వర్గాల్లో కేసులు అధికంగా కనిపిస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికే ఆసుపత్రులకు అలర్ట్ జారీ చేశారు. అనుమానితులపై వెంటనే పరీక్షలు చేస్తున్నారు. సీరమ్ శాంపిల్స్ సేకరణకు , ప్రత్యేక వార్డుల ఏర్పాటు చేశారు. ప్రాథమిక చికిత్సకు మందుల నిల్వ తదితర చర్యలను చేపట్టారు.
ఆరోగ్య శాఖ జాగ్రత్తలు
వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు ముఖ్య సూచనలు చేసింది. వ్యక్తిగత రక్షణ :
శరీరాన్ని పూర్తిగా కప్పుకునే దుస్తులు ధరించాలి. కీటక వికర్షకాలు (రిపెలెంట్స్) ఉపయోగించాలి .గడ్డి, పొదల ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో పొదలు, గడ్డి దట్టంగా పెరగనివ్వకూడదు. ఎలుకల (Rats) నియంత్రణ చర్యలు తీసుకో వాలి. ఎందుకంటే చిగ్గర్ల పెరుగుదలకు ఇవే ప్రధాన వాహకాలు, అనారోగ్యం కనిపించిన వెంటనే..ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి.స్వయంగా మందులు తీసుకోవద్దు. జ్వరాన్ని లైట్‌గా తీసుకోకూడదు
ఆలస్యంతో ప్రాణాపాయం
స్క్రబ్ టైఫస్‌కు డాక్సీసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్‌తో (Antibiotics) త్వరిత గతిన చికిత్స లభిస్తుంది. ఆలస్యం చేస్తే పరిస్థితి విషమించవచ్చు. అందువల్ల తొలి లక్షణాల దగ్గరే ఆసుపత్రిని సంప్రదించడం అత్యంత అవసరం. ప్రజల్లో అవగాహన పెంచడానికి కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ స్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బందిని మండలాల వారీగా పంపిణీ చేసి గ్రామాల్లో జాగ్రత్తలు వివరించే కార్యక్రమాలు చేపడుతోంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ఒక్కటే పరిసరాలు శుభ్రంగా ఉంచండి, వ్యక్తిగత రక్షణ పాటించండి, అలస్యము చేయకుండా పరీక్షలు చేయించుకోండి.

