న్యాయమైన కోరికలను పరిష్కరిస్తాం ..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కాజీపేట, (ఆంధ్రప్రభ) : కాజీపేట రైల్వే మల్టీ పర్పస్ కోచ్ ఫ్యాక్టరీ పర్యటన సందర్భంగా కేంద్ర గనుల–బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని తెలంగాణ రైల్వే జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింహరావు ఆధ్వర్యంలో భూ నిర్వాసితులకు, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు, 139 ఏళ్ల కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ భవన స్థానంలో స్విమ్మింగ్ పూల్, ఏసీ కమ్యూనిటీ హాల్, ఇండోర్ షటిల్ కోర్ట్ వంటి సదుపాయాలతో కొత్త భవనం నిర్మాణం చేయాలని కోరారు.
అలాగే 15 ఏళ్లుగా సబ్‌స్టిట్యూట్‌గా పని చేస్తున్న బాయ్స్‌ను శాశ్వతం చేయాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రానికి స్పందించిన మంత్రి కిషన్ రెడ్డి, జేఏసీ పెట్టిన న్యాయమైన కోరికలను తప్పకుండా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైల్వే ఇన్స్టిట్యూట్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం విషయంలో రైల్వే మంత్రికి స్వయంగా సిఫారసు చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో జేఏసీ కో–కన్వీనర్లు జి. భాస్కర్, డి. రవీందర్, వైస్ చైర్మన్లు పి. రమేష్, ఎం. రాజయ్య, సామాజికవేత్త శిరుమల్ల రమేష్ కుమార్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
