కాలోజీ వర్సిటీ వ్యవహారంపై సీఎం సీరియస్..

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిబ లేని విద్యార్థులను సైతం ఉత్తర్ణుల్నీ చేశారన్న వ్యవహారంపై పూర్తిస్థాయిలో తక్షణమే విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంవో ఉన్నతాధికారులను ఆదేశించారు.
నానాటికీ తెలంగాణ ప్రతిష్టను పెంచుతూ ఆర్థిక సుస్థిరత సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు. కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్‌ఛార్జీల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణలపై ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పని చేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని, అది సాధ్యం కాని పక్షంలో తప్పుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వ చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు.
