- పులివెందుల ఏఎస్ డబ్ల్యూ జ్యోతి సస్పెన్షన్
- జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజలాదేవి సరెండర్
- ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన ప్రభుత్వం
కడప బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో వెనుకబడిన తరగతుల హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్ల నుండి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్న ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరు అధికారులు ఏకకాలంలో బలయ్యారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని అంజులాదేవిని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల నుండి తప్పించింది. అలాగే పులివెందుల అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్న జ్యోతిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆమె వసూల్ రాణి అనే కథనాన్ని ఆంధ్రప్రభ గత నెల 23న ప్రముఖంగా ప్రచురించింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బీసీ వెల్ఫేర్ జాయింట్ డాక్టర్ చిన్నబాబు కడపకు వచ్చి అక్టోబర్ 24, 25,26 తారీకుల్లో మూడు రోజులపాటు ఆంధ్రప్రభ కథనంపై విచారణ చేపట్టారు.


విచారణ లో అధికారులకు వ్యతిరేకంగా నెలనెలా అందిస్తున్న మామూళ్ల విషయంలో వార్డెన్లు పూస గుచ్చినట్లు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కడపలో జరిపిన విచారణను నివేదిక రూపంలో ప్రభుత్వానికి చిన్న బాబు అందించారు. విచారణ నివేదికపై ప్రభుత్వం శుక్రవారం చర్యలు చేపట్టింది.
కడప జిల్లాలో పనిచేస్తున్న బీసీ వెల్ఫేర్ అధికారిని అంజలాదేవిని తక్షణమే బాధ్యతలు నుండి వైదొలగమని బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి మల్లికార్జున ఆదేశించారు. ఆమె స్థానంలో ఇతరులకు ఇన్చార్జి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను డైరెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా పులివెందుల ఏఎస్ డబ్ల్యూ అధికారిని జ్యోతిని సస్పెండ్ చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. ఆంధ్రప్రభ కథనంపై ఏకకాలంలో ఇద్దరు అధికారులపై చర్యలు చేపట్టడం పట్ల సంచలనంగా మారింది.
హాస్టళ్లలో అక్రమాలను సహించేది లేదు
బీసీ హాస్టళ్లు, ఎంజేపీ బీసీ గురుకులాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో కడప జిల్లా పులివెందుల అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణిని విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు.
ఆమె అక్రమాలకు పరోక్షంగా సహకరించిన జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణిని హెడ్డాఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు తెలిపారు. కడప జిల్లా పులివెందులకు చెందిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి.జ్యోతిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ తో విచారణ చేపట్టామన్నారు.
ఆ విచారణలో జ్యోతిపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో, ఆమె విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించామన్నారు. ఆ ఆదేశాలకనుగుణంగా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి.జ్యోతిని సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. జ్యోతి అక్రమాలను అడ్డుకట్ట వేయకుండా, పరోక్షంగా ఆమెకు సహకరించినట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి అంజల దేవీని విధుల నుంచి రిలీవ్ చేస్తూ విజయవాడ హెడ్డాఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
తల్లిదండ్రుల స్థానంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన హాస్టల్ సిబ్బంది అక్రమాలకు పాల్పడడం బాధాకరమన్నారు.. ప్రభుత్వంపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను హాస్టళ్లలో విడిచిపెట్టి వెలుతున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ బిడ్డలకు ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందిస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు.

