Collector | ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శం

Collector | ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శం

రాజకుమారి : జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి


Collector | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన మహిళా రైతు రాజకుమారి ప్రకృతి వ్యవసాయంలోస్ఫూర్తిదాయకమైన ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి (District Collector Dr. A. Siri) అభిప్రాయపడ్డారు. బుధవారం రాజకుమారి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ పొలాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ మొక్కజొన్న రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. 70 సెంట్ల భూమిని కౌలు తీసుకుని ప్రకృతి పద్ధతుల్లో పంటలు సాగుచేస్తున్నట్టు రాజకుమారి వివరించారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన అనంతరం జూలైలో ప్రధాన పంటగా కందులు, అంతర పంటలుగా అనుములు, అలసందలు, సజ్జలు, గోరుచిక్కుడు, మినుములు వేశానని తెలిపారు. అదనంగా గోంగూర, తోటకూర, చుక్కకూర, పాలకూరలను కూడా సాగు చేశారని చెప్పారు.

నాలుగు నెలల్లో గోరుచిక్కుడు, అలసందలు, సజ్జలు, మినుములు (whispers) ఆకుకూరలకు మంచి దిగుబడి వచ్చిందని రాజకుమారి పేర్కొన్నారు. గోరుచిక్కుడు 5 క్వింటాళ్లకు రూ.35 వేల ఆదాయం, ఆకుకూరల ద్వారా రూ.10 వేల ఆదాయం, అలసందలు 10 కిలోలకు రూ.800, మినుములతో కూడా లాభం పొందినట్టు వివరించారు. మొత్తం రూ.5 వేల పెట్టుబడితో ఇప్పటివరకు రూ.60 వేల లాభం పొందానని తెలిపారు. కందులు, మినుముల విత్తనాలు రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచితంగా లభించాయని, కందులు 4 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని, రూ.25 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. మొత్తానికి లక్ష రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకృతి సిద్ధ పద్ధతులతో నేల ఆరోగ్యం మెరుగుపరుస్తూ, తక్కువ వ్యయంతో అధిక లాభాలు సాధించడం ద్వారా ప్రకృతి వ్యవసాయానికి రాజకుమారి ఆదర్శంగా నిలుస్తున్నారని కలెక్టర్ అభినందించారు. రసాయన రహిత వ్యవసాయం పర్యావరణ పరిరక్షణకు, రైతుల ఆదాయ పెరుగుదలకు అత్యంత ఉపయోగకరమని తెలిపారు. రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగు వేయాలని, బహుళ పంటలు సాగుచేసి ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు.

మొక్కజొన్న పంటపై కలెక్టర్ ఆరా

అనంతరం మొక్కజొన్న రైతులతో మాట్లాడిన కలెక్టర్ (Collector) పంట తేమశాతాన్ని డిజిటల్ మాయిశ్చరైజర్ మీటర్ ద్వారా పరీక్షించారు. పంటను సమగ్రంగా ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు. మొక్కజొన్నను పౌల్ట్రీ, బెవరేజెస్, బిస్కెట్లు తయారీకి విస్తృతంగా ఉపయోగిస్తారని, దీనిపై సమగ్ర సమాచారం సేకరించాలని వ్యవసాయ శాఖకు ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఉప్పలపాడు గ్రామంలో టమోటా సాగు పరిశీలన ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో మహబూబ్ హుస్సేన్ సాగుచేస్తున్న టమోటా పంటను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి పద్ధతులు అనుసరించాలంటూ రైతులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజ కృష్ణారెడ్డి, నేచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply