రైతు డబ్బులు.. రాజన్న ఖాతాలోకి..
- పొరపాటున ఆలయ ఖాతాకు ఆధార్ లింక్
- రూ.2.14 లక్షల కోసం బాధితుల మొర
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, (ఆంధ్రప్రభ): ఓ రైతు పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు అనుకోకుండా వేములవాడ రాజన్న ఆలయ ఖాతాలో జమయ్యాయి.. పొరపాటున ఆలయ బ్యాంకు ఖాతాకు రైతు సత్తమ్మ ఆధార్ కార్డు అనుసంధానం కావడంతో ఏకంగా రూ.2.14లక్షల నగదు ఆలయ ఖాతాకు జమ కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణానికి చెందిన ఏదుల సత్తమ్మ వంట గ్యాస్ సబ్సిడీ కూడా గత కొంత కాలంగా రాజన్న ఆలయం అకౌంటులో జమవుతున్నట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఇప్పుడు పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు కూడా రాజన్న ఆలయ అకౌంటులోనే జమ కావడంతో సత్తమ్మ దిక్కుతోచని స్థితిలో పడింది.
సత్తమ్మ ఆధార్ నంబర్ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాకి పొరబాటున అనుసంధానం కావడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సత్తమ్మ తమ డబ్బులు ఇప్పించాలని ఈవోని కోరగా, ఇది తమ తప్పిదం కాదని బ్యాంకు అధికారులనే అడగాలని చెప్పినట్లు బాధితులు వాపోతున్నారు.
రాజన్న అలయ ఖాతాలో మొత్తం 2 లక్షల 14 వేలు జమ కావడంతో తమ డబ్బు కోసం సిసిఐ, ఆలయ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
