Srisailam | కార్తీకం మాసంలో కొత్త రికార్డు…

Srisailam | కార్తీకం మాసంలో కొత్త రికార్డు…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం మంగళవారం దేవస్థానంహుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
కార్తికమాస హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.7,27,26,400 /- నగదు రాబడిగా లభించిందన్నారు. కార్తీకమాసంలో ఇంత అధికమొత్తంలో హుండీ రాబడిగా లభించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 33 రోజులలో గత నెల 23వ తేదీ నుంచి ఈనెల 24వ తేదీ వరకు భక్తులు సమర్పించినది.
గత సంవత్సర కార్తీకమాసంలో రూ.5,96,92,376/-లు రాబడిగా లభించడం జరిగిందన్నారు. గత సంవతర్సరం కార్తీకామాసం కంటే ఈ సంవత్సరం కార్తీకమాసంలో రూ.1,30,34,024లు అధిక రాబడిగా లభించడం విశేషం. అలాగే ఈ హుండీలో 117 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారు, 7కేజీ 230 గ్రాముల వెండి లభించాయన్నారు .
అదేవిధంగా 646 – యుఎస్ఏ డాలర్లు, 120 – యు.ఏ.ఈ దిర్హమ్స్, 85 – సౌదిరియాల్స్, 136- కత్తార్ రియాల్స్, 30 – సింగపూర్ డాలర్లు, 85– ఇంగ్లాడ్ పౌండ్స్ 200 – ఓమన్ బైంసా, 25 – ఆస్ట్రేలియా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు మరియు దేవదాయ శాఖ ఇన్ స్పెక్టర్ హరిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
