Farmer | అన్నదాత సుఖీభవ

Farmer | అన్నదాత సుఖీభవ
జిల్లాలో 2.72 లక్షల మంది రైతులకు రూ.181 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం
Farmer | కర్నూలు, ఆంధ్రప్రభ : అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఈ నెల 19వ తేదీన రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయనుందని, అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి (District Collector D.r A.Siri) వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్డీవో లు, వ్యవసాయ శాఖ ఏడి లు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది తదితరులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2.72 లక్షల మంది రైతులకు రూ.181 కోట్లు ప్రభుత్వం జమ చేయనుందని తెలిపారు.
ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు జమ కానుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి (Prime Minister) కోయంబత్తూరు నుండి, ముఖ్యమంత్రి కడప జిల్లా కమలాపురం నుండి పాల్గొననున్నారని, నిధుల విడుదల కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరగాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రజా ప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
రైతులు పంట మార్పిడి చేసుకునేలా అవగాహన కల్పించాలి
జిల్లాలో రైతులు పంట మార్పిడి చేసుకునేలా అవగాహన కల్పించాలని, అలాగే మూడు రకాల పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ (Department Of Agriculture) అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఇరిగేటెడ్ సోర్స్ కింద ప్రకృతి వ్యవసాయం సాగు చేసేలా, పశువులు, గొర్రెలు, ఆవులు పెంచుకునేలా రైతులను ప్రోత్సహించాలని, కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కు సంబంధించి రైతు సేవా కేంద్రాల సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, కిసాన్ కపాస్ యాప్ లో ఆన్లైన్ స్లాట్స్ కు సంబంధించి రైతులకు సహకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో రైతులు ఏ పంట సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారు, ఎన్ని ఎరువులు వాడారు,భూసార పరీక్షల వివరాలు,ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక తదితర వివరాలన్నీ నిర్దేశిత ప్రొఫార్మాలో 10 రోజుల్లోపు ఇవ్వాలని కలెక్టర్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ కోసం ట్రేడర్లను లింక్ అప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, పంట వేసినప్పటి నుండి అమ్ముకునే వరకు రైతులకు తగిన సహకారం అందించేలా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (Collector) ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
