Srisailam | తెప్పోత్సవం వాయిదా..
Srisailam | తెప్పోత్సవం వాయిదా..
Srisailam, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల (Nandyal) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీకమాసోత్సవాల సందర్భంగా మంగళవారం నిర్వహించే తిప్పుతూ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. కార్తీకమాస ఉత్సవం సందర్భంగా గతంలో మాసశివరాత్రిరోజున అనగా నవంబరు 18వ తేదీన పాతాళగంగలో శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవాన్ని జరిపించాలని గతంలో నిర్ణయించడం జరిగిందన్నారు. పాతాళ గంగలో నీటిమట్టం పెరిగిన కారణంగా ప్రస్తుతం నిర్వహించతలపెట్టిన తెప్పోత్సవాన్ని వాయిదా వేయడమైనదన్నారు.
పాతాళగంగలో నీటిమట్టం విషయమై డ్యాం మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించడం జరిగిందన్నారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 883.20 అడుగులు సామర్థ్యం 205.6627 టి.యం.సిలు ఉన్నట్లుగా అధికారులు ధ్రువీకరిస్తూ తెలిపారు. అదే విధంగా జెన్ కో పవర్ హౌస్ ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నందున నీటిమట్టంలో ఆకస్మికంగా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉన్నదని డ్యాం అధికారులు తెలియజేశారు. కావున దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతా కారణాల దృష్ట్యా పాతాళగంగలో ప్రస్తుతం తెప్పోత్సవం నిర్వహించడం శ్రేయస్కరం కానందున, తెప్పోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది అన్నారు.
కావున భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కార్యనిర్వాహణాధికారి తెలిపారు.
